రాజకీయ నాయకులన్నాకా అలివికాని హామీలివ్వడం…ఆవలించినంత తేలిక. అయితే, నేతాశ్రీలిచ్చే హామీలు అలివికానివైనా సరే…వారిరిన అపహాస్యం చేసేలా ఉంటే మాత్రం…ప్రతిపక్ష నేతలు సదరు కామెంట్లు చేసిన నేతను ఓ ఆటాడుకుంటారు. ఇక, తాజాగా ఏపీలో ప్రజాగ్రహ సభలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చీప్ గా చేసిన లిక్కర్ కామెంట్లు ఆ కోవలోకే వస్తాయి. ఏపీలో కోటిమంది తాగుబోతులున్నారని, వారంతా కలిసికట్టుగా తాగి ఊగి బీజేపీని గెలిపిస్తే క్వార్టర్ లిక్కర్ బాటిల్ రూ.70కే ఇస్తానని సోము చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
సోము కామెంట్లపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోము కామెంట్లపై మంత్రి కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. ఏం స్కీమ్ ఇది…. ఎంత అవమానకరమైనదంటూ కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ జాతీయ విధానాన్ని ఏపీ బీజేపీ ఎంత దిగజార్చిందో చూడండి అంటూ మండిపడ్డారు. చీప్ లిక్కర్‌ను రూ.50కే ఇస్తారట…గెలుపు కోసం బీజేపీ తహతహలాడుతోన్న రాష్ట్రాలలో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందా? అంటూ సెటైర్లు వేశారు.
సోము వ్యాఖ్యాలపై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. చీప్ లిక్కర్ తో బీజేపీ… ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ నేతలు ప్రజల రక్తం పీల్చుతున్నారని మండిపడ్డారు. ఎక్కడ చూసినా మద్యం, ఏ సమయంలోనైనా మద్యం…లిక్కర్ పేరుతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మద్యానికి ప్రజలను, యువతను బానిసలను చేస్తున్నారని, మహిళల భద్రతను గాలికొదిలేస్తూ, జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు.