హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. డంపింగ్ యార్డు తరలింపు వ్యవహారంలో స్థానిక టీడీపీ, వైసీపీ నేతలకు మధ్య సోషల్ మీడియాలో జరిగిన సవాళ్ల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలు కొందరు హిందూపురంలోని బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా…దానికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని మధ్యలోనే నిలువరించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పట్టణ శివార్లలో ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించే విషయంపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. దీంతో, ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సవాల్ విసరగా…దానిని టీడీపీ నేతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు నేడు బాలయ్య ఇంటికి చేరుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ‘జై బాలయ్య’ అంటూ టీడీపీ కార్యకర్తలు, అటు ‘జై జగన్’ అంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింంది. ఉద్రిక్తత నేపథ్యంలో బాలయ్య ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
21వ వార్డులో డంపింగ్ యార్డ్ గురించి టీడీపీ నేత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఆ డంపింగ్ యార్డును ఇతర ప్రాంతానికి తరలించారని, గత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అద తప్ప మరో అభివృద్ధి జరగలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ చంద్రమౌళీ విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా..టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.