లుగు ప్రజలతో పాటు సినిమాను ప్రేమించే వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చెక్కిన తాజా చిత్ర శిల్పం ఈ మూవీ. ఇద్దరు క్రేజీ హీరోలతో కలిపి సినిమా చేసే ధైర్యం తెలుగు దర్శకులకు లేదేమో అన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. అసలుసిసలు మల్టీ స్టారర్ మూవీని సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 7న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్.. అల్లూరు సీతారామరాజుగా రామ్ చరణ్ అలియాస్ చెర్రీలు నటిస్తుంటే వారికి బాలీవుడ్ భామ అలియా భట్ చెర్రీతో.. హాలీవుడ్ నటి ఒలివియా తారక్ తో జత కట్టనున్నారు. అయితే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ విడుదల ఆగుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. భయపెడుతున్న ఒమిక్రాన్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. తెలుగు సినిమా రేంజ్ ను శిఖర స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. బాహుబలి తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే.
ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోవటంతో ఆంక్షల చట్రాన్ని తెర మీదకు తీసుకొచ్చేశారు. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో పరిమితులు విధిస్తున్నారు. రాత్రి వేళలో కర్ఫ్యూ విధించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది. ఈ లోపు కేసులు భారీగా పెరిగినా.. పలు రాష్ట్రాలు నియంత్రణలు విధిస్తే.. అప్పుడు ఈ మూవీని విడుదల చేస్తే జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో దర్శక నిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా చూసేందుకు ప్రేక్షకులు రెఢీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మరికొన్ని సినిమాల్ని చూడకుండా త్యాగం చేసినోళ్లు కొందరున్నారు. ఒకవైపు ఒమిక్రాన్ మరోవైపు.. ఏపీలో టికెట్ల ధర తగ్గింపు.. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున థియేటర్లు మూసేస్తున్నన వేళ.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రతిష్ఠాత్మక ‘ఆర్ఆర్ఆర్’ విడుదల చేస్తే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఏపీలో టికెట్ల ధరల తగ్గింపు.. థియేటర్ల మూసివేత ఆర్ఆర్ఆర్ విడుదలను ఆపే అవకాశం తక్కువే అయినా.. ఒమిక్రాన్ పరిణామాలు మాత్రమే సినిమా విడుదల మీద ప్రభావాన్ని చూపించే వీలుందని చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజమెంతన్న విషయాన్ని జక్కన్న ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ ఈ ఉదంతంపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.