ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ఎంఎల్ఏ అన్నా రాంబాబు తొందరలోనే రాజీనామా చేయబోతున్నారా ? ఇపుడిదే విషయమై చర్చ మొదలైంది. ఈ చర్చకు ఎంఎల్ఏనే ఆస్కారం ఇచ్చారు. ఈమధ్యనే అధికారపార్టీ నేత సుబ్బారావు గుప్తా పార్టీ సమావేశంలో మాట్లాడుతు మంత్రి కొడాలినాని, ఎంఎల్ఏలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వైఖరిపై తన అభిప్రాయాలను చెప్పిన విషయం తెలిసిందే.
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు మరో నేత సుభాని సహచర నేత గుప్తాపై దాడిచేశారు. ఆ విషయం బాగా సంచలనమైంది. ఇదే విషయమై ఎంఎల్ఏ రాంబాబు మాట్లాడుతు తొందరలోనే సీఎంను కలిసి తానొక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు. గుప్తాపై సుభాని దాడిచేయటం తనను బాధించిందన్నారు. ఇదే సమయంలో మంత్రి, ఎంఎల్ఏలపై సుబ్బారావు చేసిన వ్యాఖ్యలను కూడా ఎంఎల్ఏ తప్పుపట్టారు.
స్వామి భక్తిని ప్రదర్శించడం కోసం సుభాని మరో పార్టీ నేతపై దాడి చేయడం కరెక్టు కాదన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే దెబ్బలు తిన్న సుబ్బారావు, ఎంఎల్ఏ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. సుబ్బారావు మాట్లాడటానికి, సుభాని దాడి చేయటానికి సామాజికవర్గాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సుభాని అత్యుత్సాహంతోనే దాడిచేశారు. దాడి చేయటమే తప్పంటే పైగా దాడి ఘటనలను వీడియో తీసి వైరల్ చేయటం ఇంకా తప్పు.
దాంతోనే ఘటన సోషల్ మీడియాలో అంతగా సంచలనమైంది. సరే విషయం ఏదైనా ఎంఎల్ఏ తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏమై ఉంటుందనే విషయమై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. నిజంగానే రాంబాబు రాజీనామా చేస్తారా ? అనే చర్చ ఊపందుకుంటోంది. సుబ్బారావు మీద జరిగిన దాడి కారణంగా తన పదవికి రాజీనామా చేసేంత సీన్ ఎంఎల్ఏకి ఉందా అనే చర్చయితే పెరిగిపోతోంది. దాంతో సీఎంను కలిసినపుడు ఏమి చెప్పబోతున్నారు ? అనేది ఇపుడు ఆసక్తిగా మారింది. చూద్దాం ఎంఎల్ఏ చివరకు ఏమి చేస్తారో.