ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు, విగ్రహాలు, రథాలు, ఆస్తులపై దాడులు పెరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో ఆ ఆరోపణలకు ఊతమిచ్చే ఘటనలు ఎన్నో జరగడంతో ఏపీ సర్కార్ వైఖరి సర్వత్రా చర్చనీయాంశమైంది. హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న పరిణామాలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. దీంతోపాటు, జగన్ పాలనలో ఏపీలో క్రిస్టియన్ మత ప్రచారం పెరిగిపోయిందన్న ఆరోపణలున్నాయి.
అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి చారిత్రక రథం దగ్ధం ఘటన, విజయవాడ కనకదుర్గ ఆలయంలో సింహాల ప్రతిమల దొంగతనం, తిరుపతిలో సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారం, కాకినాడలో దేవీ విగ్రహాలు ధ్వంసం, నెల్లూరులో రథం ధ్వంసం, ఆర్చీలు బద్దలు కొట్టడం, ఆంజనేయుడి స్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం, విజయనగరంలోని రామతీర్థ ఆలయంలో రామచంద్రస్వామి విగ్రహం తల నరికివేత…వంటి వందలాదిఘటనలపై హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ని జరిగినా…ఆ ఘటనలకు కారణమైనవారిని పట్టుకోలేకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇక, హిందూ పండుగలకు ముందు కరోనా సాకుతో జగన్ ఆంక్షలు విధిస్తున్నారని చాలాకాలం నుంచి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే జగన్ రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో డెల్టా వేరియంట్ పేరుతో పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, ఒమైక్రాన్ దృష్ట్యా క్రిస్మస్పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని పరిపూర్ణానంద ప్రశ్నించారు.
హిందువుల పండుగల పేరు చెప్పగానే జగన్ కు కరోనా గుర్తుకువస్తుందా అని ప్రశ్నించారు. హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపని, పథకం ప్రకారం ఆలయాలపై దాడులు జరిగాయని మండిపడ్డారు. అంతర్వేది ఘటన నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేదని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ అంటూ అభూత కల్పన సృష్టించారని, నిజంగా పింక్ డైమండ్ ఉందో లేదో తేల్చాలని నిలదీశారు.
టీటీడీకి నిధులు కావాలంటే వేరే మార్గాలు ఎంచుకోవాలని, స్వామివారి మీద ప్రయోగాలు చేయడం తగదని, దేవుడి సేవలు అని చెప్పి డబ్బు సంపాదించడం మానేయాలని హితవు పలికారు. టీటీడీ లక్ష్యం వేదాన్ని రక్షించడమేనని పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు.