విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండ రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన వ్యవహారంపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, కోదండ రామాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు సమాచారం లేకుండా, ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ఆహ్వానించకుండా వైసీపీ సర్కార్ కక్ష తీర్చుకుందని ఆరోపణలు వచ్చాయి. శంకుస్థాపన విషయంలో అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తనను వెల్లంపల్లి కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆరోపించారు.
ఈ క్రమంలోనే తాజాగా అశోక్ గజపతిరాజుపై పోలీస్ కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. శంకుస్థాపన శిలాఫలకాన్ని అశోక్ గజపతి రాజు తోసేశారని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసాద్ ఫిర్యాదు ప్రకారం అశోక్ గజపతి రాజుపై 473,353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఈవో తెలిపారు.
మరోవైపు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతి రాజు నియామకంపై సంచయిత గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అశోక్ గజపతి రాజును ఛైర్మన్ గా నియమిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును సంచయిత డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. అయితే, హైకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో, ఒకే రోజు అశోక్ గజపతికి రెండు షాక్ లు తగిలినట్లయింది.