ఆయన ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే.. కానీ కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్ష మాల వేసుకుని నుదుట విభూది రాసుకుని స్వామీజీగా మారిపోయారు. రాజకీయాలంటే విరక్తి పుట్టి ఇలా సన్యాసం తీసుకున్నారేమో అనుకుంటే పొరపడ్డట్టే. తమ పార్టీ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమే ఆయన ఇలా గెటప్ వేశారు. ఆయనే.. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు (కన్నబాబు). స్వామీజీగా మారువేషం ధరించి తమ ప్రభుత్వ పాలనపై ఆరా తీసేందుకు ఇలా ప్రజల్లోకి వెళ్లారు.
సీఎం జగన్ పరిపాలనపై జనాభిప్రాయం తెలుసుకునేందుకు రమణమూర్తి స్వామీజీ వేషం కట్టారు. తన నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం మండల కేంద్రంతో పాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లోనూ ఆయన ఇలా స్వామీజీ గెటప్‌లో పర్యటించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరాత్నల సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జనాల నాడీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సంక్షేమ పథకాల అమలు తీరు బాగుందని కొన్ని చోట్ల ప్రజలు చెప్పగా.. మరికొన్ని చోట్ల మాత్రం నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని జనాలు తెలిపారు. రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదని చెప్పడంతో పాటు ఓటీఎస్ పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అదే గెటప్‌లో ఎమ్మెల్యే నేరుగా తహసీల్దార్ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు వెళ్లారు. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను అధికారులకు వివరించారు. ఆశ్చర్యకరంగా ఓ సన్యాసి వచ్చి ప్రజా సమస్యలను తమ దృష్టికి తేవడంపై ఆ అధికారులు విస్మయం చెందారు. ఇంతకూ తమరెవరూ అంటూ ఆ స్వామీజీని ప్రశ్నించారు. దీంతో గెటప్ తొలగించిన ఎమ్మెల్యేను చూసి తహశీల్దార్ ఆశ్యర్యపోయారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలకు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఓ ఎమ్మెల్యే ఇలా మారువేషంలో రావడం ఇప్పుడు వైరల్‌గా మారింది. జగన్ పాలనపై నిఘాపెట్టి..’స్పై’గా మారిన వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహారం వైరల్ అయింది.