మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి వ్యవహారం గతంలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుపై ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ నియమించిన సంచయిత గజపతిరాజును కాదని అశోక్ గజపతి రాజునే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా నియమించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పటి నుంచి అశోక్ గజపతిరాజును ఇరుకున పెట్టేందుకు, అవమానించేందుకు ఏపీ సర్కార్ రకరకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చాలా ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని తుంగలో తొక్కిన జగన్ సర్కార్…అశోక్ గజపతిరాజును మరోసారి అవమానించింది. విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న కోదండ రామాలయ పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి రాజుగారిని ఆహ్వానించకుండా అవమానించింది.
దీంతో, ఇలా చేయడం ఏంటని ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. ధర్మకర్తల మండలితో చర్చించకుండానే ఆలయ పునర్నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పునర్నిర్మాణ, శంకుస్థాపన శిలాఫలకాలను అశోక్ గజపతిరాజు తోసేశారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజుకు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి, బొత్స నారాయణలు గుడికి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తాజా ఘటన నేపథ్యంలో జగన్ సర్కార్ పై అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. దేవాదయ శాఖ ఆనవాయితీని జగన్ ప్రభుత్వం పాటించట్లేదని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని, ఒక్క నిందితుడిని కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులలాగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.
గత ఏడాది డిసెంబర్ 28న బోడికొండపై కోదండ రామాలయంలో రాముడి శిరస్సు భాగం ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన వైరల్ కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని సంప్రదాయ పద్ధతిలో తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయించింది. ఈరోజు ఆలయ పునర్మిర్మాణానికి శంకుస్థాపన చేయబోతోంది. కానీ, ఆలయ ధర్మకర్త హోదాలో అశోక్ గజపతిరాజును పిలవకపోవడంతో వివాదం రేగింది.