సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 3 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన స్వగ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ అడుగుపెట్టనున్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఏపీలో ఆయన పర్యటన కొనసాగనుంది. డిసెంబరు 24వ తేదీన తన స్వగ్రామం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. తొలిసారి స్వగ్రామంలో పర్యటించనున్న జస్టిస్ ఎన్వీ రమణ కోసం గ్రామస్తులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 24న ఉదయం 10 గంటలకు ఆయన గ్రామానికి చేరుకుంటారు. అనంతరం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం డిసెంబరు 25 తేదీన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇక, డిసెంబరు 26న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల రెండో సదస్సుకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనున్న ఈ సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొనబోతున్నారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ పి.నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తర్వాత ఏపీ హైకోర్టును జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి సందర్శించనున్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం , బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ హైకోర్టుకు ఆయన రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏపీ పర్యటనలో భాగంగా హైకోర్టును సందర్శించాలని జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి ఆహ్వానించారు. కాగా, ఏపీ టూర్ లో భాగంగా జస్టిస్ ఎన్వీ రమణతో జగన్ భేటీ అవుతారా? లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.