ఏపీలో కొంతకాలంగా పీఆర్సీ వ్యవహారంపై రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని ప్రకటించింది. కానీ, ఉద్యోగ సంఘాలు మాత్రం దానికి ససేమిరా అంటున్నాయి. కనీసం 33 శాతం కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని 14.29 శాతంగా ఫిక్స్ చేసిందంటూ తాజాగా ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆ విషయం వివరించేందుకే బుధవారం నాడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకారమైతే ఉద్యోగుల జీతాలు తగ్గుతాయి. అయితే, ఆ తగ్గుదలను డీఏతో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో, ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగ సంఘాల నేతలు అడకత్తెరలో పోకచెక్కలా మారారట. ఫిట్మెంట్, పీఆర్సీ, ఐఆర్, డీఏ, పేస్కేళ్లు వంటి లెక్కలపైనే సమావేశంలో చర్చించనున్నారట.
30%, 20% హెచ్ఆర్ఏ తీసుకుంటున్న ఉద్యోగులను 16% హెచ్ఆర్ఏ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. 60 నెలలకుగాను రెండు డీఏల ఎరియర్స్ రూ.6,000 కోట్లు ఉద్యోగులకు ఇవ్వలేదు. కానీ, వాటిలో ఒక డీఏ ఎరియర్ ఇచ్చినట్టు చూపడంతో ఉద్యోగుల జీతంలో నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్ అయింది. దీంతో, ఉద్యోగులంతా డీఏపై అసంతృప్తిగా ఉన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమైతేనే ఉద్యమాన్ని విరమిస్తామని, ఉద్యమానికి తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు తెలిపారు. మరి, ఈ రోజు భేటీలో ఏం జరుగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.