వావ్.. వండర్ ఫుల్ అనే ఎపిసోడ్ ఏపీలో చోటు చేసుకుంది. తమ నాయకుడు కమ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తావా నా కొడకా? అంటూ ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఉదంతం తెలిసిందే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఇరగబాదుడు వీడియో వైరల్ కావటం.. ఏపీ అధికారపక్షం పూర్తిగా సెల్ఫ్ డిఫెన్సులో పడిపోవటం తెలిసిందే. అప్పటికి ఈ వీడియో మీద మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మంత్రి బాలినేని మాట్లాడుతూ.. కార్యకర్తలు ఏదో ఆవేశంతో చేసి ఉంటారని.. అయినా తప్పుడు మాటలు ఎలా మాట్లాడతారన్న రీతిలో మాట్లాడటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రాత్రికి రాత్రి ఏమైందో తెలీదు కానీ.. ఈ రోజు (మంగళవారం) ఉదయానికి సీన్ మొత్తం మారిపోయింది. భయంతో లాడ్జిలో దాక్కున్న సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను పట్టుకొని.. విపరీతంగా కొట్టి.. మోకాళ్ల మీద నిలబెట్టి.. క్షమించాలని వేడుకోవాలంటూ విరుచుకుపడిన బాలినేని అనుచరుడు సుభాని తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రోజు అదే సుబ్బారావు గుప్తాను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తాకు మంత్రి బాలినేని కేక్ తినిపించారు.
ఈ సందర్భంగా నిన్నటివరకు బాధితుడిగా నిలిచిన సుబ్బారావు తాజాగా మాట్లాడుతూ.. తనకు బాలినేని అండగా ఉంటారని చెప్పారని.. పోలీసులు రక్షణ కల్పిస్తారని హామీ ఇచ్చారన్నారు. జై జగన్.. జై బాలినేని.. వర్థిల్లాలి జగన్ నాయకత్వం అంటూ సుబ్బారావు నినాదాలు చేయటం ఆసక్తికరంగా మారింది.
సుబ్బారావుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల దాడిని ఆర్యవైశ్యులు తీవ్రంగా ఖండించటంతో పాటు.. బాలినేని అనుచరుడు సుభానీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన కేసులో సుభానీని పోలీసులు అరెస్టు చేయలేదని.. కేవలం కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుబ్బారావు మాత్రం ఏదో గ్యాప్ వల్ల అలా జరిగిందని.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరారు.
నిజమే పాపం.. గదిలో పడేసి.. ఒక రేంజ్ లో కుమ్మేసిన వేళ.. భార్య.. ముగ్గురు పిల్లల ఉన్న ఒక మధ్యతరగతి సగటు రాజకీయ నాయకుడి నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశించగలం..? ఈ ఎపిసోడ్ లో మంత్రి బాలినేని చురుకుదనాన్ని అభినందించాలి. ఇప్పటికే జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసేలా.. ఆయన వ్యవహరించిన వైనాన్ని మిగిలిన నేతలు రాబోయే రోజుల్లో అందిపుచ్చుకుంటారేమో?
అతనికి మతి స్థిమితం ఉందని తెలుస్తుంది..
గుప్త పైన, మంత్రి బాలినేని..సేం డా.సుధాకర్ కేసు లాగే. pic.twitter.com/vqosWWBvov
— Amaravati Voice (@amaravativoice) December 20, 2021