జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన అలవికాని హామీలను, అసంబద్ధ నిర్ణయాలను ప్రశ్నిస్తూ వస్తున్న రఘురామపై జగన్ కక్ష తీర్చుకున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రఘురామను రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయించడం, లాకప్ లో హింసించారని ఆరోపణలు రావడం జాతీయ స్థాయిలో కలకలం రేపాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ వ్యవహారంపై రఘురామ స్పందించారు. తన ఒంటిపై పడిన తొలి దెబ్బ పోలీస్ దెబ్బని, ఎంపీని అయి ఉండి కూడా థర్డ్ డిగ్రీ దెబ్బలు తినడం ఓ రికార్డని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఓ పోలీసు అధికారి తనను హింసించారని, పోలీసులు తనను కొట్టిన సంగతి ప్రధాని మోడీకీ చెప్పానని అన్నారు. ఆ చిత్రహింసలను ఫోన్లో ‘పై వాడికి’ చూపించారని, అది చూసి ఆయన ఆనందించారని చెప్పారు.
వైఎస్సార్‌తో తనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామ పేర్కొన్నారు. తనను పార్లమెంటు లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాలని అపాయింట్మెంట్ తీసుకుని 5 అడుగుల పెద్ద బొకేతో ప్రత్యేక విమానంలో వచ్చానని తెలిపారు. అయితే, తన అపాయింట్మెంట్ రద్దయిందని చెప్పడంతో భరించలేనంత అవమానంగా ఫీలయ్యానని గుర్తు చేసుకున్నారు. ఆ బొకే వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయనను కలిశానని వెల్లడించారు.
కేంద్రమంత్రులను కొందరు ఎంపీలు కలుస్తున్నారని, సాయిరెడ్డి అన్న, మిథునన్న తప్ప ఎవరూ కలవకూడదని తన పేరు కూడా చెప్పకుండా తన గురించి ప్రస్తావించారని చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితమే జగన్‌లో అపరిచితుడి లక్షణాలున్నాయని, కానీ, పాదయాత్ర తర్వాత మారిపోయారని పీకే చెప్పడంతో నమ్మేశానని అన్నారు. జగన్ పాలన వల్ల పార్టీ భవిష్యత్తు దెబ్బ తింటోందన్న ఆవేదనతోనే పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నానని అన్నారు. రఘురామ పార్లమెంటులో మాతృభాషపై మాట్లాడిన తర్వాతే జగన్‌కు, తనకు మధ్య గ్యాప్ పెరిగిందని అన్నారు.