ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కొంతకాలంగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా తమకు రావలసిన నీటిని ఆంధ్రాకు జగన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి, జల ట్రైబ్యునల్ కు కూడా సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ఎన్జీటీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్జీటీ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని కేంద్ర పర్యారణ శాఖ కూడా గతంలోనే ఆదేశించింది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాకిచ్చింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా పనులను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అంతేకాదు, తమ ఆదేశాలను ధిక్కరించి నిర్మాణాలను చేపడితే పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతోపాటు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అధ్యయనానికి నిపుణులతో కూడిన కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. 4 నెలల్లో దానిపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
మరోవైపు, ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ చీఫ్ సెక్రటరీపై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని అభిప్రాయపడింది. కాగా, గతంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్థల సేకరణ, ఆయకట్టు వివరాలనూ సమర్పించాలని కేంద్రం కోరింది. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టమైన డ్రాయింగ్స్, లేఅవుట్లు, చార్ట్‌లను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకం ద్వారా ఎంత నీటిని వాడుకోవాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని ఆదేశించింది.