అన్ని తెలిసినట్లే ఉంటాయి కానీ ఏమీ తెలీని రీతిలో పావులు కదపటం.. ఎక్కడో వేసిన స్విచ్ కు మరెక్కడో బల్బు వెలగటం రాజకీయాలకు మాత్రమే సాధ్యం. తాజాగా చెబుతున్న ఉదంతం కూడా అదే కోవకు చెందింది. విన్నంతనే ఒక పట్టాన నిజమనిపించదు కానీ.. లోతుగా చూసినప్పుడు.. లాజిక్కులు వెతికినప్పుడు.. అవును, ఇలా జరిగే అవకాశం ఉంది సుమా? అన్న భావన కలుగుతుంది. ఇంతకీ హీరో సూర్య ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో చిక్కుకోవటం ఏమిటి? అన్న సందేహం కలుగుతుంది కదూ? ఆ మాటకు వస్తే.. హీరో సూర్యకు.. జగన్ కు మధ్య లింకు ఏముందని ఇలా అంటున్నారు? బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేస్తున్నారే? అన్న మండిపాటు రావటం సహజం. కానీ.. కాస్తంత కూల్ గా ఆలోచిస్తే.. విషయం ఇట్టే బోధ పడుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సినీ నటుడు సూర్యకు మధ్య ఎంతో మంచి ఫ్రెండ్ షిఫ్ ఉంది. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మా మాటల్లో కాకుండా.. హీరో సూర్య మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘జగన్ అన్న కజిన్ అనిల్ రెడ్డి నాకు క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్. మేం చెన్నైలో ఐస్‌క్రీంలు తినడం కోసం తరచుగా బయటకు వెళ్లే వాళ్లం. అనిల్ ద్వారా జగన్ అన్న కుటుంబానికి కూడా బాగా దగ్గరయ్యా’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సూర్య. స్నేహం ఉంటే లింకు పెట్టేయటమేనా? అనొచ్చు. రాజకీయాలు.. రాజకీయ నిర్ణయాలు.. తరచూ చోటుచేసుకునే పరిణామాల మీద కూడా సూర్య ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు.
ఏపీ ఎన్నికల ఫలితాల మీద సూర్య చేసిన వ్యాఖ్య.. ఆయన స్పందన చూస్తే.. ‘‘పదేళ్ల క్రితం జగన్ అన్న కుటుంబానికి, రాష్ట్రానికి తీరని లోటు జరిగింది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. అలుపెరగకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. ఘన విజయం సాధించారు. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రజల్లో జగన్ పట్ల ఎంత అభిమానం ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. జగన్ అన్న ఎన్నికల్లో గెలిచారనే వార్త తెలియగానే హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన దేశంలో రెండో పిన్న వయస్కుడైన సీఎం. ఆయన సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు సూర్య.
ఇక్కడితో సూర్యకు.. జగన్ కు మధ్యనున్న స్నేహం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.ఇక.. ఆయన ట్రాప్ లో పడిపోవటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. రెండు.. మూడు రోజుల క్రితం మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కమ్ జై భీమ్ సినిమా ఫేం జస్టిస్ కె. చంద్రు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు తెచ్చుకోండి. ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ .. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రు పాల్గొన్నారు.
ఆయన కార్యక్రమానికి వచ్చారా? తిరిగి వెళ్లారా? అంటే.. అదో చిన్న వార్తగా మాత్రమే మిగిలేది. కానీ.. ఆయన వచ్చిన కార్యక్రమానికి భిన్నంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మిగిలిన వ్యవస్థల మాదిరే న్యాయ వ్యవస్థకు పరిమితులు ఉన్నాయని.. ఏపీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని జగన్ ప్రభుత్వ పాలన ఏ రీతిలో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.
నిజమే.. జస్టిస్ చంద్రు చెప్పినట్లే.. మిగిలిన వ్యవస్థలకు మాదిరే న్యాయవ్యవస్థకు కూడా పరిమితులు ఉన్నాయి. అలాంటప్పుడు.. ఆ వ్యవస్థ వెల్లడించే తీర్పులకు చెడు అర్థాల్ని వెతుకుతూ.. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చేసే వ్యాఖ్యలు.. సదరు వ్యవస్థ మీద చేసే దాడిగా చంద్రుకు ఎందుకు కనిపించటం లేదు? అంతెందుకు.. ఏపీలో గడిచిన రెండున్నరేళ్లలో చోటు చేసుకున్న ఎన్నో రాజకీయ పరిణామాలు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఏపీ హైకోర్టు మాత్రమే కాదు.. సుప్రీంకోర్టు కూడా ఆక్షింతలు వేయటాన్ని ఏమనాలి? అంత దాకా ఎందుకు..ఒక వైద్యుడు.. పిచ్చోడిగా ముద్ర పడి.. చివరకు ఆ ఆవేదనతో మరణించిన వైనం మానవతావాది అయిన చంద్రుకి ఎందుకు పట్టలేదు.
ఏపీ రాజకీయాల గురించి.. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఏ మాత్రం అవగాహన ఉంది కాబట్టి.. ఆయనీ వ్యాఖ్యలు చేశారన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి గ్రౌండ్ లెవెల్ లో జరిగే పరిణామాలు.. అప్డేట్స్ చాలా వరకు తెలీదు. తమకు తెలిసిన మార్గం ద్వారా కానీ.. తమకు తెలిసిన వర్గాలు అందించే సమాచారాన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గా భావిస్తారు. వాటికి తగ్గట్లుగా స్పందిస్తుంటారు.
తాజా పరిణామాల్ని చూసినప్పుడు.. జస్టిస్ కె.చంద్రు చేసిన వ్యాఖ్యల వెనుక హీరో సూర్య పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ తో తనకున్న దగ్గరి సంబంధాల అసరాతో.. ఆయన పాలన గురించి.. ఆయనగురించి తనకు తెలిసిన పాజిటివ్ అంశాల్ని ప్రస్తావించటంతో పాటు.. ఏపీ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఆయన మాట్లాడి ఉంటారని చెబుతారు.
గతంలో ఏపీకి సంబంధించి ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ స్పందించని(?) విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రుకు ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటంలో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతాచూస్తే..జగన్ వర్గం చేసిన పక్కా ప్లాన్ అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో కంటే కూడా.. జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తనకు తెలిసిన తీరులో సూర్య చెప్పటం ద్వారా.. జస్టిస్ కె. చంద్రు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.