ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం ఆది నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని, ఆ నాసిరకం మద్యం కంపెనీలు కూడా వైసీపీ నేతలవేననన్న ఆరోపణలున్నాయి.
ఏపీలో కరోనా నేపథ్యంలో గతంలో కర్ఫ్యూ విధించిన సమయంలో కూరగాయల కొట్లు తెరవడానికి ముందే లిక్కర్ షాపులు తెరిచేంతలా జగన్ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ సొంత బ్రాండ్ మద్యం అమ్ముతున్నారని, అంతేకాకుండా మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలకు బదులుగా కేవలం నగదు లావాదేవీలను మాత్రమే జరుపుతున్నారని టీడీపీ నేతలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మద్యం అమ్మకాలలో అవకతవకలను లోక్ సభలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రస్తావించారు. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని, నగదు ద్వారా లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు జరగడం లేదని, అలా కేవలం నగదు మాత్రమే తీసుకోవడం వెనుక పెద్ద స్కామ్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో మద్యం అమ్మకాల లావాదేవీలపై కేంద్రం దృష్టిసారించాలని ఆర్ఆర్ఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్ధిక మంత్రి జోక్యం చేసుకుని నగదు చెల్లింపులకు బదులుగా డిజిటల్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి, ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.