మొన్నటి వరకు బిల్లుల విషయంలో ప్రతిపక్షాలది రాజకీయం అనుకున్నారు జనం. కానీ, మెల్లమెల్లగా జనం కళ్లకు జగన్ కప్పిన పథకాల పరదాలు తొలగిపోతున్నాయి. దీంతో, జనం కళ్లు తెరిచి జగన్ పాలనపై ప్రతిపక్షాలు, కాంట్రాక్టర్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు గ్రహిస్తున్నారు. మొన్న అంగన్ వాడీ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్…నిన్న వైఎస్సార్ జలకళ సంఘం బోర్ వెల్స్ ప్రతినిధులు…అంతకుముందు రోజు ప్రభుత్వ ఉద్యోగులు…ఇలా ఒకరి వెంట ఒకరు ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేస్తుండడంతో వాస్తవాలను జనం గ్రహిస్తున్నారు.
ఏపీలో ఆర్థిక పరిస్థితి ప్రతిపక్షాలు మొత్తుకుంటోన్న దానికంటే దారుణంగా ఉందని గ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు గుంటూరు కలెక్టరేట్ వద్ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆందోళనకు దిగడంతో జనానికి జగన్ తత్వం మరింతగా బోధపడింది. ఖాళీ కంచాలతో వారంతా తమ ఇళ్లలోని దుస్థితి ఇదని, అందుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే కారణమని నిరసన ప్రదర్శన చేయడంతో జనంలోనూ కదలిక వచ్చింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారంతా వేడుకోవడం చూసి…జనం కూడా చలించిపోయారు.
దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో, తామంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, బ్యాంకుల దగ్గర వడ్డీకి అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసినా బిల్లులు రాలేదని అంటున్నారు. గతంలో ఏపీలో ఎన్నడూ లేనంత అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కాంట్రాక్టర్లున్నారని, సీఎం జగన్ తమ సమస్యను తక్షణమే పరిష్కరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని దీనంగా వేడుకుంటున్నారు. మరి, వారి దీనావస్థ చూసైనా జగన్ మనసు కరిగి వారికి బిల్లులు చెల్లిస్తారో లేదో వేచి చూడాలి.