కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తం గా రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కూడా తమ ఉద్యమం ఆపేది లేదని ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికి తొమ్మిది సార్లు.. రైతు ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వానికి సానుకూల పరిస్థితి ఏర్పడలేదు.
ఇక, తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే భాగంలో.. దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు రైతులు పిలుపునిచ్చారు. బుధవారం(8వ తారీకు) దేశవ్యాప్తంగా బంద్ చేయనున్నట్టు అన్ని రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఇప్పటికే ఆయా ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చాయి.
రైతుల అంశం అత్యంత సున్నితమైంది కావడం.. ఓటు బ్యాంకుతో కూడుకున్న వ్యవహారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మిన్నకున్నా యి. ఇక, బీజేపీ అనుకూల పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ రైతుల పిలుపుపై తర్జన భర్జన సాగు తోంది.
తెలంగాణ సర్కారు అందరికంటే ముందుగానే.. రైతుల భారత్ బంద్‌కు తమ సం పూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించేసింది. టీఆర్ ఎస్ పార్టీ తరఫున శ్రేణులు రంగంలోకి దిగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అంటే.. రైతులతో చర్చలు మళ్లీ విఫలమై.. బంద్‌కు దారితీస్తే.. తెలంగాణలో సంపూర్ణంగా బంద్ జరిగే అవకాశం ఉంది.రాజకీయ వ్యూహం ప్రకారం చూస్తే.. కేసీఆర్ పిలుపు వెనుక బీజేపీపై ఉన్న కసి స్పష్టంగా అర్ధమవుతోంది.
తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ.. బీజేపీ నేతలపై అడపాదడపా విమర్శలు చేస్తూ వచ్చిన ఆయనకు దుబ్బాక, గ్రేటర్లో బీజేపీ పుంజుకోవడంపై మరింతగా రగిలిపోతున్నారు. దీంతో ప్రస్తుతం అందివచ్చిన బంద్‌ను అనుకూల అస్త్రంగా మలుచుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.
మరి.. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా అడుగు వేయనుంది? సీఎం జగన్ తాను.. రైతుల పక్షపాతి నని.. తనది రైతు ప్రభుత్వమని పదే పదే చెబుతుండడం.. ఈ క్రమంలో చర్చనీయాంశం. మరి అంతటి రైతు పక్షపాతి.. దేశవ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడుతున్న ఈ విషయంపై ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
రైతులకు మద్దతు ప్రకటించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తున్నా.. బీజేపీతో ఉన్న లోపాయికారీ ఒప్పందాలు జగన్‌కు అడ్డువచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో జగన్‌కు చాలాసఖ్యత అవసరం. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ బంద్‌కు అనుకూ లంగా వ్యవహరిస్తే.. వారి ఆగ్రహానికి గురికాకతప్పదు. పోనీ.. ఈ విషయాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తే.. ప్రతిపక్షాల విమర్శల సుడిలో చిక్కి తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితీ ఉంటుంది.
ఈ నేపథ్యంలో మౌనంగా ఉంటారా? లేక .. బంద్‌పై ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఇక, ఇప్పటికే రైతు సంఘాలు.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో తమ బంద్‌కు సంపూర్ణ సహకారంఅందించాలంటూ.. ప్రభుత్వానికి వినతులు పంపారు. మొత్తంగా చూస్తే.. బీజేపీ విషయంలో జగన్ వైఖరి ఇప్పుడు స్పష్టమవుతుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో వేచి చూడాలి.