ఆయన టీడీపీ హయాంలో చక్రం తిప్పారు. కీలక నాయకుడిగా ఎదిగారు. నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ తనదైన పాత్ర పోషించారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో ఎదురైన పరాజయం కారణంగా.. పార్టీ మారిపో యారు. ఫలితంగా రాజకీయంగా ఇప్పుడు అడ్రస్ కోల్పాయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన వైశ్య కమ్యూనిటీ నాయకుడు శిద్దా రాఘవరావు. తన కుమారుడికి కోసం అంటూ.. ఆయన వైసీపీలో చేరారు. అయితే.. తన కుమారుడుకి కాదు కదా.. తనకు కూడా పార్టీలో ఎక్కడా పలకరించేవారు కనిపించడం లేదు.
శిద్దాకి గాని ఆయన కొడుక్కి గాని వైసీపీలో వచ్చే ఏడాది ఎన్నికల్లో టికెట్ విషయంలో గ్యారెంటీ కూడా లభించలేదు. కేవలం వ్యాపారాలు.. వ్యవహా రాలు మాత్రమే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగుతున్నాయని చెప్పొచ్చు. కానీ, రాజకీయంగా మాత్రం కేడర్ పోయింది.. నియోజకవర్గంపై పట్టు పోయింది. పార్టీలో ఆధిపత్యం అనే మాటే లేదు. అదే టీడీపీలో ఉండి ఉంటే.. తన నియోజకవర్గంలోనే కాకుండా ప్రకాశంలోని రెండు మూడు నియోజకవర్గాల్లో ఆయన పట్టు కనిపించింది.
ఇక, అనంతపురం జిల్లాకు చెందిన శమంతకమణి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలు. తన కుమార్తె యామినీ బాలను రాజకీయాల్లోకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా, విప్‌గా కూడా పనిచేశారు. కానీ.. గత ఏడాది ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా.. పార్టీపై అక్కసుతో మారిపోయి.. వైసీపీ పంచన చేరిపోయారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే.. ప్రశ్న తప్ప సమాధానం కనిపించడం లేదు.
శింగనమల నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు.. జొన్నలగడ్డ పద్మావతి కనుసన్నల్లోనే వీరు పార్టీ మారడంతో ఆమె కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారు. అంటే.. ఎమ్మెల్యే స్థాయి.. విప్ స్థాయిని కూడా వదులుకుని ద్వితీయ శ్రేణి నాయకులుగా తల్లీకూతుళ్లు మిగిలిపోయారు. ఇలా అనేక మంది ఉన్నారు. అయితే.. వీరిద్దరూ చంద్రబాబు దగ్గర మంచి మార్కులు సంపాయించుకుని మరీ.. దూరం కావడం.. అప్పట్లో చక్రం తిప్పి.. ఇప్పుడు కనీసం అడ్రస్ కూడా కనిపించని పరిస్థితికి చేరుకోవడంతో ఆసక్తిగా మారింది.