ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వ్యవహారాలు.. ప్రతిపక్షం టీడీపీతో పోరు.. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. ఇలా సీఎం జగన్‌కు ఎన్నో సవాళ్లున్నాయి. వీటన్నిటికి తోడు మరోవైపు తమ పార్టీ నుంచే నర్సాపురం ఎంపీగా గెలిచి.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపైనే పోరాటం చేస్తున్న రఘురామ కృష్ణం రాజు జగన్‌కు పక్కలో బళ్లెంలా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీసుకుంటున్న నిర్ణయాలపై రఘురామ ఎప్పటికప్పుడూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడేమో కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ జగన్‌ను ఇరకాటంలోకి నెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విధానాలు నచ్చక..
జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చడం లేదని రఘురామ రెబల్‌గా మారారు. ఇక అప్పటి నుంచి జగన్‌పై పార్టీపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లివచ్చిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ సీబీఐ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేసింది. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
మూడు రాజధానుల నిర్ణయం, ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. ఇలా ప్రతి విషయంలోనూ జగన్‌కు కొరకరాని కొయ్యలా మారారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పటికీ లోక్‌సభ స్పీకర్ దగ్గరే పెండింగ్‌లో ఉంది. దానిపై చర్యలు తీసుకోవాలని అమిత్ షాను జగన్ కోరినా స్పీకర్ పట్టించుకోవడం లేదు. దీంతో రఘురామ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
పార్లమెంట్ సాక్షిగా..
ఏపీలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదు. అప్పులు తెచ్చే పాలన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని రఘురామ పార్లమెంట్లో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విధించే అప్పులు తీసుకునే ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరాయని మరో రూ.లక్ష కోట్లు అప్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన లోక్‌సభలో తెలిపారు. జగన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాలనే అప్పులు విషయాన్ని ఆయన లోక్‌సభలో లేవనెత్తారనేది స్పష్టమవుతోంది.
ఫిర్యాదుల పర్వం..
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి రఘురామ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కేంద్ర మహిళా సంక్షేమ శాఖకు చెందిన పలు పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని ఆయన చేసిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన పోషణ్ అభియాన్, ఐసీపీఎస్, ఐసీడీఎస్ పథకాలకు జగన్ ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు తదితర పేర్లు పెట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పేర్ల మార్పుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇక ఇటీవల అమిత్ షాను కలిసిన రఘురామ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఏపీలో పరిస్థితి అమరావతి రైతులపై పోలీసుల లాఠీఛార్జీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. అప్పుల కోసమే కొత్త అప్పులు చేస్తున్నట్లు ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.