కొంతకాలంగా జగన్ పై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తాము కూడా ప్రైవేటు ఉద్యోగుల్లాగా జీతాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి రావడంపై చాలామంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక, చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు వంటి వ్యవహారాలపై జగన్ స్పందించకపోవడంతో వారు ఉద్యమ బాట పట్టారు.
దీంతో, దిగొచ్చిన ప్రభుత్వం…ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించింది. వారి డిమాండ్లపై సీఎంవో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నాయకులు గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పీఆర్సీపై వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని, సీపీఎస్ రద్దు, డీఏ బకాయిలు వంటి సమస్యలపై చర్చించారని తెలుస్తోంది.
ఇక, ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా పట్టుబట్టిన క్రమంలోనే జగన్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జగన్…పీఆర్సీపై సంచలన ప్రకటన చేశారు. 10 రోజుల్లోగా పీఆర్సీని ప్రకటిస్తామని జగన్ చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల్లో ఉద్యోగులకు శుభవార్త చెబుతామని అన్నారు. దీంతో, ఉద్యమం చేస్తామంటేనే జగన్ దిగొచ్చారని, లేదంటే ఈ సమస్య మరింత జటిలమయ్యేదని ఉద్యోగులు అనుకుంటున్నారు.
అయితే జగన్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు స్పందించారు. జగన్ ప్రకటన చేసినట్టు తమ సంఘాల ఉద్యోగులెవరికీ సమాచారం లేదని అంటున్నారు. అంతేకాకుండా, ఈ పీఆర్సీ మాత్రమే తమ డిమాండ్ కాదని, చాలా అంశాలున్నాయని చెప్పారు. పీఆర్సీ నివేదికను అధికారులు బహిర్గతం చేస్తేనే దానిపై తాము చర్చించేందుకు వీలుంటుందని అంటున్నారు. తమ డిమాండ్లకు అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని, లేదంటే ఉద్యమ కార్యాచరణ ఈ నెల 7వ తారీకు నుంచి యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు