తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలు గులాబీ పార్టీ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలు కాషాయ శిబిరంలో సేద తీరుతున్నారు. మరి కొందరు నేతలు బీజేపీలో చేరడానికి ముహుర్తాలు, గ్రహ బలాల లెక్కలేస్తున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు పొలో మంటూ కమలం గూటికి వచ్చేందుకు తెలంగాణ ఉద్యమ నేతలు క్యూ కడుతున్నారు. గులాబీ పార్టీతో ఇక ఏగలేమని ఆ నేతలు తెగేసి చెబుతున్నాట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన నేతలు ఇప్పుడు కేసీఆర్ కు దూరంగా ఎందుకు పోతున్నారనే చర్చ జరుగుతోంది.
ఈ నేతలంతా ఉద్యమ సమయంలో కేసీఆర్ తెగ పొడిగిన వారే.. అపుడు దైవంగా కనిపించిన కేసీఆర్.. ఇపుడు దయ్యంగా కనిపిస్తున్నాట. ఇప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్ కు టీఆర్ఎస్ కు దూరం అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు చాలా క్రీయాశీలకంగా పనిచేశాయి.
అప్పటివరకు ఉద్యమ నేతలుగా ఉన్న వారంతా రాష్ట్రం ఏర్పాటుతో రాజకీయ నేతలుగా చలామణి అయ్యారు. ఆ తర్వాత ఉద్యమాలకు స్వస్తి చెప్పి కేసీఆర్ చెంత చేరారు. అయితే రాజకీయంగా పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను అందలాలకు ఎక్కించారు ఇదే నాటి ఉద్యమ నేతలకు ఇది నచ్చలేదు. దీంతో వీరంతా టీఆర్ఎస్ దూరంగా జరిగారు. ఇక ఇక్కడే ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని పసిగట్టిన నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ మొదటగా బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులను గౌరవం దక్కడంలేదని భావించిన నేతలు స్వామిగౌడ్ బాటలో నడుస్తున్నాట. ఇక విజయశాంతి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి అక్కడ ఇమడలేక కమలం పార్టీలో చేరారు.
మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాషాయ పార్టీలో కలిసిపోయారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరి ఆ పార్టీకి విజయాన్ని కూడా అందించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్థామరెడ్డి బీజేపీలో సెటిల్ అయ్యారు.
వీరితో పాటు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇక మాజీ మేయర్ రవీందర్ సింగ్ నేడో రేపో బీజేపీలో చేరుతారని చెబుతున్నారు.
అసలు తెలంగాణ ఉద్యకారులంతా ఎందుకు బీజేపీని ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు? టీఆర్ఎస్ ను బీజేపీ మాత్రమే ఎదుర్కొంటుదనే భావనలో ఈ నేతలంతా ఉన్నారట.
దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీకి ప్రజలు పట్టకట్టడంతో ముందుస్తుగా ఆ పార్టీలో చేరి తమ స్థానాలను ఫదిలం చేసుకునేందుకు నేతలు తెగ ఆరాటపడుతున్నారని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి దుబ్బాక, హుజురాబాద్ పరిస్థితులు ఉంటాయో లేదో అనే భయం కూడా కొందరిని వెంటాడుతున్నట్లు సమాచారం.
బీజేపీలో చేరిన స్వామిగౌడ్ కు ఇప్పటివరకు ఆ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఇవన్నీ తెలిసే వీరు బీజేపీలో చేరుతున్నారు. ఎందుకంటే ఇక గులాబీ పార్టీతో వేగలేక కమలం పార్టీలో చేరినట్లు సదరు నేతలు చెబుతున్నారు. ఉద్యమ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ లోకే ఇమడలేని నేతలు కమలం గూటిలో ఏమాత్రం సర్దుకుపోతారో వేచి చూడాలి.