గడిచిన కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిన శిల్పా చౌదరి వ్యవహారానికి సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. సెలబ్రిటీలు.. సమాజంలో హైక్లాస్ వర్గాలకు చెందిన మహిళల్ని ఆకర్షిస్తూ.. వారికి మాయ మాటలు చెప్పి.. సినిమాలు తీస్తున్నట్లు చెప్పే మాటల్ని నమ్మి భారీ మొత్తాల్లో డబ్బులు ఇచ్చిన వైనం తెలిసిందే.
శిల్పా ఆంటీ దెబ్బకు ఆ రంగం..ఈ రంగం అన్న తేడా లేకుండా అందరూ ఆమె చేతిలో అడ్డంగా బుక్ అయ్యారు.
ఇలా బుక్ అయిన వారిలో ప్రముఖ టాలీవుడ్ హీరో మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా మోసపోయిన వారిలో ఉన్నారు. ఆమె శిల్పా చౌదరికి రూ.2కోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదును ఆమె నార్సింగ్ పోలీసులకు అందజేశారు. తన వద్ద రూ.2 కోట్లకు పైగా డబ్బు తీసుకొని శిల్పా చౌదరి తమను మోసం చేసినట్లుగా ఆమె కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.
శిల్పా చౌదరి బారిన పడిన వారి సంఖ్య తాజాగా 90కు చేరుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. టీవీ.. సినిమా నిర్మాతగా పరిచయం చేసుకొని.. సంపన్నుల మాదిరి బిల్డప్ ఇచ్చి.. మాయ మాటలు చెప్పి భారీగా డబ్బులు దోచేసింది.
ఒక అంచనా ప్రకారం దాదాపు రూ.100 – రూ.200 కోట్లకు పైనే మోసం చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో దాదాపు రూ.50 కోట్ల మొత్తాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సంపన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారితో పరిచయాలు పెంచుకోవటం.. వారి కోసం ప్రత్యేకంగా వీకెండ్లలో పార్టీలు నిర్వహించటం లాంటివి చేసేవని చెబుతున్నారు. తొలుత కిట్టీ పార్టీలతో మొదలు పెట్టిన ఆమె.. తర్వాత కాలంలో పేకాట క్లబ్ ను రహస్యంగా నిర్వహించేవారని చెబుతన్నారు.
దివానోస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. సంపన్న వర్గాలకు చెందిన 90 మంది మహిళల్ని సభ్యులుగా చేర్పుకొని విందులు.. వినోదాల్ని నిర్వహించేవారని చెబుతున్నారు. ఆ పరిచయంతో వారికి వ్యాపారం పేరుతో మాయమాటలు చెప్పి.. భారీగా డబ్బులు లాగేసేవారు. తాజాగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో.. మోసం చేసి తీసుకున్న డబ్బుల్ని ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.