జాతీయ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్రంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు.. జాతీయ పార్టీ నాయకులు.. రెడీ అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే 12 మంది విపక్ష సభ్యులకు రాజ్యసభలో గట్టి షాక్ తగిలింది.
గత వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించారంటూ.. సదరు ఎంపీలపై క్రమశిక్షణా చర్యల కింద రాజ్యసభ వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12 మందిపై వేటు వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. ఫులో దేవి నేతమ్, ఛయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్‌లు ఉండగా.. సీపీఎం నేత ఎలమరమ్ కరీమ్, సీపీఐ నేత బినోయ్ విస్వమ్, టీఎంసీ నేతలు దోలా సెన్, శాంట ఛెత్రి, శివసేన నుంచి ప్రియాంక ఛతుర్వేది, అనిల్ దేశాయ్‌లపై వేటు పడింది.
ఇక, ఈ విషయం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయటం పూర్తిగా అన్యాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం గందరగోళం సృష్టించారు, కానీ, ఛైర్మన్ మమ్మల్నే సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ ఛాయా వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
మెజారిటీ ఉందన్న కారణంగా ప్రధాని మోడీ తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కూనీ చేయటమేనని కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా అన్నారు.
ఇక, ఈ ఘటనపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని.. రాజ్యసభ , లోక్‌సభలోనూ.. ఈ విషయాన్ని లేవనెత్తి.. సభ్యుల సస్పెన్షన్‌ను ప్రశ్నించాలని.. పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మరోసారి పార్లమెంటు గందలగోళానికి వేదిక కానుందని అంటున్నారు పరిశీలకులు.