అది ఏదో మారుమూల ప్రాంతం కాదు. నగరం నడిబొడ్డున ఉండే కూకట్ పల్లిలో.. జనావాసాల మధ్య ఒక ఇంట్లో ఏర్పాటు చేసిన భారీ రేవ్ పార్టీ. శివారులో అయితే.. పోలీసులకు తెలుస్తుంది కానీ.. కాలనీ మధ్యలో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరని అనుకున్నారో ఏమో కానీ.. ఏకంగా ‘రేవ్ పార్టీ’ని ఏర్పాటు చేసిన వైనం షాకింగ్ గా మారింది.
స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో మరో ట్విస్టు ఏమంటే.. పార్టీలో పాల్గొన్న 42 మంది స్వలింగ సంపర్కులే కావటం. కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఒక ఇంట్లో భారీ రేవ్ పార్టీ సాగుతోంది.దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు చేతికి వచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన కూకట్ పల్లి పోలీసులకు మాదాపూర్ ఎస్వీటీ పోలీసులు కలిసి శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత తనిఖీలు నిర్వహించారు. ఫిర్యాదులు వచ్చిన ఇంట్లో భారీ లైటింగ్ తో పాటు.. భారీ శబ్దాలతో పాటల మధ్య అనేక మంది యువకులు డ్యాన్సులు చేస్తున్నారు.
కొందరు డ్యాన్సులు చేస్తుంటే.. మరికొందరు హుక్కా తాగుతూ కనిపించారు. మరికొందరు మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ గ్రూపులో ఇద్దరు హిజ్రాలు.. మిగిలిన వారంతా స్వలింగ సంపర్కులే కావటం గమనార్హం.
దీంతో.. అనుమతి లేకుండా ఎక్కువ మంది గుమిగూడి ఉండటం.. అక్రమంగా మద్యం.. హుక్కాను సరఫరా చేయటంతో పాటు.. పెద్ద ఎత్తున కండోమ్ బాక్సులు కనిపించాయి. దీంతో.. నిర్వాహకులైన హిజ్రాలు దయాల్ (35).. ఇమ్రాన్ (28)లను పోలీసులు అరెస్టు చేశారు.
భారీ శబ్దాలతో అసౌకర్యం కలిగించినందుకు 42 మంది స్వలింగ సంపర్కులపై న్యూసెన్సు కేసును నమోదు చేశారు. ఈ ఉదంతం అనంతరం పోలీసులు దీనిపై విచారణ చేయగా.. పలు విషయాలు బయటకు వచ్చాయి.
ఇక్కడ ప్రతి వారం రేవ్ పార్టీని నిర్వహిస్తారని.. ఏడాదిగా ఇదే తంతు సాగుతున్నట్లుగా గుర్తించారు. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. ఒడిశాకు చెందిన దయాల్ ఈ సెంటర్ కు ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. విడి రోజుల్లో మసాజ్ కేంద్రాన్ని నడుపుతూ.. శనివారాల్లో మాత్రం స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు.
పార్టీకి వచ్చే ప్రతి ఒక్కరు రూ.300చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించాలి. మద్యం.. హుక్కా.. ఫుడ్ ను నిర్వాహకులే సరఫరా చేస్తారు. దీనికి అదనంగాచెల్లించాల్సి ఉంటుంది. తరచూ పార్టీలు జరిగినా ఎక్కువ మంది రాకపోవటంతో పెద్దగా అనుమానం రాలేదు. తాజాగామాత్రం పెద్ద ఎత్తున రావటంతో సందేహాలు వచ్చాయి. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు అందటం.. వారి ఎంట్రీతో విషయం బయటకు వచ్చింది.