పైకి ‘మనం మనం బరంపురం’ అనుకుంటూ లోలోపల’ ఎవరికీ ఎవరూ సొంతమూ ఎంతవరకీ బంధమూ’ అనేలా ఉన్న నేటి “తానా భారతం”లో లేటెస్ట్ అప్డేట్ లు ‘నమస్తే ఆంధ్ర’ పాఠకుల కోసం ప్రత్యేకం
ముందుగా ప్రస్తుత జట్ల వివరాలు ఒక్కసారి సంక్షిప్తంగా నెమరు వేద్దాం
జట్టు 1- మాజీ అధిష్టానం జట్టు: ముగ్గురు మాజీ అధ్యక్షులు ముఠాగా ఏర్పడి ఒక దశాబ్దంన్నర కాలం పాటు క్రమ క్రమంగా సంస్థను గుప్పిట్లోకి తెచ్చుకున్న తర్వాత ఏమి చేసినా చెల్లుద్దనే అహం తలకెక్కి ‘తానా’ శ్రేయస్సుని గాలికి వదిలి డబ్బులున్నాయని కొంతమందిని, అణిగి మణిగి ఉంటారని కొంతమందిని, వ్యాపార లాభం-రాజకీయ బంధం-మంది బలం లో ఏదో ఒకటి ఉందని మరి కొంతమందిని అందలమెక్కించి వారితో హాయ్ హాయ్ నాయకా అనిపించుకుంటూ, ఇంటా బయటా అంతా తామే అని డప్పాలు కొట్టుకుంటూ, తాము సృష్టించుకొన్న త్రిశంకు స్వర్గంలో మైమరచి విహరిస్తూ ఉండగా, గత కొన్ని ఎన్నికల్లో తాము అందలమెక్కించిన వారందరూ కుమ్మక్కై కుమ్మిన కుమ్ముడుకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇంతకు ముందు రోజుల్లో సగం సమయం ‘తానా’ యవ్వారాలు, పంచాయతీలు అంటూ కాన్ఫరెన్స్ లో ఉండే ముగ్గురు ప్రస్తుతం ఖాళీగా ఉండలేక స్వంత పనుల్లో బిజీ గా ఉండటానికి ప్రయత్నిస్తూ రాబోయే కాలానికి ఎలా వ్యవహరించాలో అని తికమక పడుతున్నారు.
జట్టు 2 – భూత భవిష్యత్ అధ్యక్షుల జట్టు: మంచి వ్యాపార వేత్తలంటే తక్కువ కాలంలో ఆశించిన లక్ష్యం చేరడానికి ఎవరితోనైనా న్యాయాన్యాయల ఊసులేకుండా సమయానుకూలంగా వియ్యమైన కయ్యమైనా నెరుపుతూ సాధించుకోవడమే కదా! సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ మాజీ అధిష్టానం అధికార మైకంలో ఉన్న అనుకూల పరిస్థితిలో అమెరికా వ్యాప్తంగా కలిసి వచ్చిన మరికొంతమంది వ్యాపారవేత్తలను, అనుచరగణాన్ని కూడా కలుపుకొని తమ నైపుణ్యంతో వీరితో వినమ్రంగా కలగలిసిపోయి గుంభనంగా మిగతావారి మైకం దిగే లోపే తమ లక్ష్యాలను అనుకున్న మేరకు సాధించుకొన్నట్లే, అయితే వీరిని నమ్ముకుని ఉన్న వారి కోసం (తమ వరకు) పెద్దగా పోయేదేం లేదు కనుక రాబోయే కాలంలో ఏమి చేయాలో తర్జన భర్జనలు పడుతున్నారు.
జట్టు 3 -తాజా అధ్యక్షుడి జట్టు: సొంతంగా బలమైన రాజకీయ నేపథ్యం కానీ, వ్యాపారం గానీ లేకపోయినా స్వతహాగా మంచివాడై, స్నేహశీలియై ఒక జీవితాశయాన్ని నిర్దేశించుకొని తనకున్న ప్రతీ పరిచయాన్ని మరికొన్ని పరిచయాలుగా గానీ, ‘తానా’ సభ్యులని చేర్పించడానికి గానీ ఉపయోగించుకుంటూ, ‘అలవికాని చోట అధికులమనరాదు’ అనే సూత్రాన్ని పాటిస్తూ తన గమ్యాన్ని చేరేవరకు అవసరమైనప్పుడు తగ్గుతూ నిలకడగా వ్యవహరిస్తూ లక్ష్యాన్ని చేరుకునే సమయానికి స్వంత ఊళ్ళోనే అందివచ్చిన (దేవుడిచ్చిన) సోదరుడితో కలిసి ఒక ముఖ్య జట్టుగా అవతరించినట్టే. ఇంతవరకు తమ గంపలో ఉన్న ఓటు బ్యాంకు మూలంగా కలిసివచ్చిన రాజకీయ సమీకరణాల్లో లాభం పొంది స్వంత వర్గం తో పాటు, ప్రస్తుత అధికారం మూలంగా రాసుకుపూసుకు తిరుగుతున్న మిగతా వారిని చూసి భవిష్యత్తు అంతా తమదే అనే ఊహలతో కూడికలు తీసివేతలతో వ్యూహాల మీద వ్యూహాలు చేస్తున్నట్లుంది.
‘తానా’లో ఏమి జరుగుతోంది?
గత సంవత్సర కాలంలో చాపకింద నీరులా జట్టు 2 మరియు జట్టు 3 కలసి ‘తానా’లో ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ రాజ్యమేలుతున్న జట్టు 1 కి వ్యతిరేకంగా కూటమి కట్టి ‘చేంజ్’ అంటూ ఎన్నికల యుద్ధం జరిపి గెలిచిన విషయం మనందరికీ విదితమే. ఈ ఎన్నికల సందర్భంగా ఈ ‘చేంజ్’ కూటమి తమ ప్రత్యర్థి జట్టు 1 వారి నమ్మకస్థులతోనే సంస్కరణల పేరుతో వెన్నుపోట్ల ప్రయోగం దగ్గరి నుంచి విష ప్రచారాలు, ధన ప్రవాహం తో పాటు అనేక టక్కుటమార విద్యలను ప్రయోగిస్తూ మైండ్ గేమ్ తో ‘తానా’ సభ్యులను, జట్టు 1 కి సాంప్రదాయ వ్యతిరేకులను ఆకట్టుకొని ‘తానా’ బాలట్లను ఇళ్లకే వెళ్లి కలెక్ట్ చేసుకుని కొద్ది తేడాతో గెలిచారు. అయితే గెలిచే వరకు ఓటమి భయంతో కలిసి పనిచేసిన 2, 3 జట్లకు విజయం పొందగానే సొంత అస్తిత్వాలు, భేషజాలుకు తోడు తమ రెండు జట్ల మధ్యన ఉన్న మౌలిక తేడాలు స్పష్టంగా అగుపించడంతో కలిసి కాపురం కష్టమేనని స్పష్టమైంది. సంస్థ వ్యవహారాల్లో పైచేయి కై ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్యం పొందడానికి తమ బుర్రలకు పని పెట్టారు.
వెంటనే జట్టు 2 తమకున్న స్వంత ధన ప్రాబల్యంకు తోడు ఈ మధ్యనే వచ్చిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు మూలంగా రెట్టింపైన ధైర్యంతో ఖర్చులకు ఎదురులేదని భావించి ‘తానా’ కాన్ఫరెన్సును లేటుగానైనా తమ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించి తద్వారా క్రింది క్యాడరును ఇంకా ‘తానా’ సభ్యులను తమ వైపు మరల్చుకోవచ్చని తలచారు. అందుకై కరోనా మూలకంగా గత టర్మ్ లో సభ్యుల ప్రత్యక్ష కలయికతో ప్రోగ్రాములు చేయ లేకపోవటాన్ని కారణంగా చూపి మరికొన్ని నెలలు పదవి పొడిగింపును కోరారు, ఈ మధ్యనే సాధించిన ఎన్నికల ఘన విజయం మూలంగా కార్యవర్గాల్లో ఉన్న పూర్తి మెజారిటీ తో తేలిగ్గా జరిగి పోతుందనీ తలచారు. కానీ ఈ టర్మ్ అధికారాన్ని పొందవలసిన జట్టు 3 ప్రస్తుత టర్మ్ పొడిగిస్తే తమ టర్మ్ పరిమితి తగ్గుతుంది కదా అనే విషయాన్ని కొద్దిగా సాగదీశారు. ఈ లోగా ఇందులో మర్మాన్ని కనిపెట్టి, తమ జట్టు క్రమంగా సెకండ్ గ్రేడ్ జట్టుగా మారిపోయే ప్రమాదాన్ని కూడా గమనించి ‘అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని’, By-Laws లను అడ్డుపెట్టి, తమ వాదానికి కలసి వచ్చే కొద్దిమంది సీనియర్ నాయకులను సలహాల పేరుతో కూడగట్టి జట్టు 2 అడిగే టర్మ్ పొడిగింపుకి మోకాలొడ్డారు. దీనిపై భగ్గుమన్న జట్టు 2 మరి కొన్నిప్రయత్నాలను సాగించి చినప్పటికీ చివరికి చేతులెత్తేసిన కారణంగా ప్రస్తుత టీం మామూలు సమయానికే భాధ్యతలను ఎట్టి హడావిడి లేకుండా చేపట్టింది. వెరసి ఈ కూటమి గెలిచిన రెండు నెలలలోపునే నిట్టనిలువుగా చీలి రెండు వర్గాలుగా విడివడి నివురుగప్పిన నిప్పులా రాజకీయాన్ని నడుపుతున్నారు.
మరి ఇంత త్వరగా ఈ మధ్యనే గెలిచిన కూటమి నిట్టనిలువునా చీలితే జట్టు 1 అయిన మాజీ అధిష్ఠానం పరిస్థితి ‘రొట్టె విరిగి తేనెలో పడింది’ అనుకుంటే మనం వేడి వేడి పప్పు లో కాలు వేసినట్లే. ఎప్పుడైతే ఎదురే లేదని, అపజయమే ఉండదనీ భావించిన ఈ జట్టు గత ఎన్నికల్లో చతికిల పడిందో వీరి భజన చేసి తరించే వందిమాగధులు అత్యధిక శాతం తమకు ఆశ్రయమిచ్చే లేదా నచ్చిన చోటుకు తలోదిక్కున తరలి పోయారు. అలాగే చురుగ్గా ఉన్న మిగతా రెండు జట్లు పోటా పోటీగా వీరికి ఆహ్వానం ఇస్తూ ‘అలై బలై’ విందులు జరుపుకుంటున్నారు. కొద్దిమంది అత్యుత్సాహవంతులు రెండు జట్లలోనూ చేరగా మరికొద్ది మంది బలాబలాలను జాగ్రత్తగా బేరీజు వేస్తున్నారు. అయితే జట్టు 1 వాళ్ళు ఇంకా వీరిలో చాలామంది తమతోనే ఉన్నారనీ, ఉంటారనీ భావిస్తూ భ్రమిస్తూ సరైన సమయంలో తమ ప్రభావం చూపిస్తామనే చెప్పుతున్నారు. తెలుగు సంస్కృతి, భాషాభివృద్దికి పాటుపడుతూ తెలుగు ప్రజల అవసరాలకు సేవాకార్యక్రమాల్ని ఘనంగా జరపాల్సిన ‘తానా’ నాయకత్వం ఇలా మూడు ముక్కలుగా చీలి అధిపత్యపోరు కై సమయాన్ని కేటాయిస్తుండగా ఈ మధ్యనే ఎన్నికల్లో గెలిచిన కొద్దిమంది తమ బాధ్యతగా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాల్ని రీజినల్ స్థాయిలో నిర్వహిస్తూ తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటినే ఫ్లయర్స్ రూపంలో ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్స్ వంటి సోషల్ మీడియాలో అందరూ గమనించే ఉంటారు. అంతేకానీ తెలుగు సమాజానికి స్ఫూర్తి కలిగిస్తూ అవసరమైన సేవా మార్గాన్ని కలుగచేసే ధీమ్ తానా, టీం స్క్వేర్, మన ఊరి కోసం, రైతు కోసం వంటి బృహత్తర కార్యక్రమాల్ని మరింత చేరువ చేస్తూ నిర్వహించే సమర్థత, స్ఫూర్తి, కలుపుకుని వెళ్లే పరిస్థితి ఎవరికైనా కనిపిస్తుందా?
‘తానా’ జట్టుల నాయకులు ఏం చేస్తున్నారు? మూడు ముక్కలాటలో వ్యూహాలేంటి?
విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని పైన వివరించిన వివరాలకు తోడుగా కలిపినప్పుడు తెలుస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి.
జట్టు 1 మాజీ అధిష్టానం ప్రస్తుత అనుకూల పరిస్థితుల్ని తమకు ఉపయోగ పడేటట్లుగా వాడుకోవడం మీద ఇంతవరకూ విఫలమైనట్లే భావించాలి. వీరిలో పిన్నవయస్కుడైన ‘బాహుబలి’ ప్రస్తుతం ఎదురు గాలి వీస్తున్న మూలంగా తన దందాలకు కొత్త డైమెన్షన్ ఇచ్చే పనిలో బిజీగా ఉంటూ కొంత పురోగతి సాగిస్తున్నట్లు, ‘తానా’ యవ్వారాలకు మళ్ళీ గ్రిప్ దొరికే వరకు కొంత గ్యాప్ ఇవ్వడం మంచిదని భావిస్తున్నట్లు భోగట్టా. ‘మంత్రాలూ తంత్రాలు’ ఎదుటివాడు నమ్మినంతవరకే గాని నిజం కాదని తెలిసిపోయిన తరువాత పప్పులు ఉడకవని గమనించిన ఇంకొక ముఖ్యుడు జట్టుల మధ్య భేషజాలకు పోకుండా సందు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన మూడవ నాయకునికి తెలుగు సమాజంలో స్వంతంగా పలుకుడి పరపతి(పెదరాయుడు తరహా) ఉన్నా ‘తానా’లో అధిష్ఠానం పేరుతొ గతంలో జరిగిన అవకతవకలు ఆపలేక తెచ్చుకున్న వ్యతిరేకతకు తోడుగా గత ఎన్నికల్లో సరైన టీం లేకుండా, అలాగే ‘తానా’ సేవలో చెప్పుకోదగిన సేవలు చేయని నాయకుడ్ని నమ్మకస్థుడు అనే కారణంతో ముందు పెట్టుకొని గెలిపించడానికి ఊరూరా తిరిగి అపజయం పొందడం, తానే పెంచి పోషించిన ఇద్దరు సంస్కరణల పేరుతొ వెన్నుపోటు పొడవడం ఇంకా బాధిస్తున్నట్టే చెప్పాలి. ముగ్గురూ ఒక్క మాట మీదే ఉంటూ గుట్టుగా సాగించిన ‘తానా’ గత ఆధిపత్య ధోరణి లో దెబ్బతిన్న కారణాలను అర్థం చేసుకొని ప్రస్తుతానికి ఈయనదే ముఖ్య భూమిక కనుక మిగతా వారి అజెండాను తాత్కాలికంగానైనా పక్కనపెట్టి ‘తానా’ ఉజ్జ్వల భవిష్యత్తే ప్రధానంగా తీసుకుని వ్యవహరిస్తే చాలామంది ఈయనకు సహకరించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటికీ కొత్తగా లేదా సంచలనంగా ఆలోచించకుండా ‘తానా’ సేవలో చెప్పుకోదగిన వారిని కాకుండా అటూ ఇటూ తేల్చుకోలేని చరిత్ర ఉన్న వారినీ, తమను విజయతీరాలకు చేర్చ లేని వారిని, పక్క చూపులు చూసే వారినీ పెట్టుకుని ముందుకెళ్తే మళ్ళీ శ్రుంగభంగమవుతుందేమో చూసుకోవాలి. నిజానికి తమ కోసం 100% నిఖార్సుగా నిలబడే వారు ప్రస్తుతం ఎవరూ లేరనే విషయం అర్ధమయ్యే ఉండాలి. దానికి తోడు గత ఎన్నికల్లో ముందూ వెనుకా కుళ్లబొడిచిన వారు రెండు వర్గాలుగా విడివడి తమ ఆధిపత్యం కోసం రకరకాల మార్గాల్లో(???) వారి స్వప్రయోజనాల కోసం ఈయనతో పని చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ముందే ఆపలేక వారితో కలగలిస్తే మళ్ళీ పూర్వ వైభవం గురించి మరిచి పోవచ్చును. కనుక మిగతా రెండు జట్ల లోకి వెళ్లిన తమ సానుభూతి పరులు ఇస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని దానికి తగినట్లు గా వ్యూహ రచన చేసుకొని, మరికొన్ని సభ్యత్వాలను పెంచుకొని మంచి ఎన్నికల టీం తయారు చేసుకుంటే విజయానికి ముందు వరసలో ఉన్నట్లే లెక్క
ఇక జట్టు 2 అధినాయకుడైన గత అధ్యక్షుల వారు తాము ఆశించిన పదవీకాలం పొడిగింపు తిరస్కరణ తో మొదలైన అసంతృప్తితో క్రమంగా ‘తానా’ మొత్తాన్ని గుప్పిట్లో పట్టడానికి వీలైన ప్రయత్నాలను అందరికంటే ముందుగా మొదలు పెట్టారు. అందుకు అమెరికా వ్యాప్తంగా పరిచయస్తులను తమ గ్రూప్ లోకి ఆహ్వానిస్తూ, చోటా మోటా నాయకులందరినీ వివిధ రకాలుగా సమీకరణ చేసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ గ్రూప్ నమ్మకస్థులు, ముఖ్యంగా వెన్నుపోటు ద్వయంలో ఒకరితో, ఏదో ఒక కారణంతో ‘తానా’ ముఖ్యులకు కాల్ చేపిస్తూ మధ్యలో తాను కానీ, తదుపరి అధ్యక్షుడు గాని కాల్ లో దూరి తమ జట్టుతో చేరే విధంగా మెంటరింగ్ చేయడం చాలా మందికి ఇప్పటికే అనుభవమయ్యింది. తెలంగాణా కోసం బొంత పురుగు నయినా ముద్దు పెట్టుకుంటాను అని అంటూ ప్రతి ప్రత్యర్థి పార్టీతో ఒక్కోసారి కూటమి కట్టిన కెసిఆర్ లాగా తాము జట్టు 3 తో కలసి నానా దుర్భాషలతో ఓడించిన జట్టు 1 ముఖ్యనాయకులు ముగ్గురితోనూ సఖ్యత కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండటం వీరి వ్యాపార ధోరణికి అద్దం పడుతుంది. ఇక ఈ జట్టు రెండో ముఖ్యుడు ‘ఏక్ ‘ నిరంజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కూడా రోడ్డెక్కకుండా పరిపాలన సాగిస్తుంటే, ఈయన మరియు ఈయన ‘అభిమానులు’ ఏదో మహా సామ్రాజ్యాన్ని జయించినట్లు జిల్లాల వ్యాప్తంగా టపాకాలతో, ‘తానా’ అంటే తెలియని మహిళా వృద్దుల ఊరేగింపులతో, బిల్డింగుల మీదనుంచి పూల జల్లులతో, కార్ల ర్యాలీ లతో, భారీ హోర్డింగులుతో, క్రేన్లు మాత్రమే మోయగలిగే భారీ పూల దండలతో, పౌర సన్మానాలతో వివిధ జిల్లాలో చేస్తున్న విన్యాసాలు, ఇస్తున్న ప్రసంగాలు, హామీలు ఇండియా, అమెరికా తెలుగు ప్రజల నోళ్లు తెరిపించాయి. గత ఎన్నికల్లో బలైపోయిన ‘బాహుబలి’ కూడా తన సమయం వచ్చేవరకు ఓపిగ్గా ఎదురు చూసి, లోకల్ సంప్రదాయంగా దగ్గరలో ఉన్న ఒక గుర్రాన్ని మాత్రమే ఎక్కి, కాన్ఫరెన్స్ కొరకు వచ్చిన వారిలో తన పరిచయస్తులను మాత్రమే కూడేసుకొని అట్టహాసం గా పదవీ స్వీకారం చేస్తే దాన్ని “చేంజ్” అంటూ హేళన చేసిన వీరి ఉద్దేశ్యం= మేమైతే ‘నెక్స్ట్ లెవెల్’ లో చూపిస్తాం అనేమో అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా వీరు చేసే పనులు పిచ్చి కుదిరింది అంటే అవును అందుకే రోకలి తలకు చుట్టుకున్నామన్నట్టు ఉంది కదా? అలాగే ధన ప్రాబల్యం ఉంది కాబట్టి తమకు అలవాటైన కొత్త సభ్యత్వాలను చేర్పించుకుంటూ, జట్టు 1 పొందుకై ప్రయత్నాలు చేస్తూ తమ టీంను విస్తరించడానికి పాట్లు పడుతున్నప్పటికీ ఆమోదయోగ్యమైన ఎన్నికల టీం నాయకుడు లేకపోవడం పెద్ద ఇబ్బందే.
ఇక మిగిలిన జట్టు 3 తమకి అలవాటైన రీతిలో మిగతా జట్లను నిశితంగా పరిశీలిస్తూ గుంభనంగా పని కానిస్తున్నారు. అధికారంలో ఉన్న కారణంగా తమతో వివిధ కారణాలతో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మందిని తమ గ్రూపుగా భావిస్తూ, తమకు ఉన్న బాలట్ కలెక్షన్ లెక్కల మీద ఆశతో ఇప్పటివరకు మిగతావాళ్ళు ఇస్తున్న గుర్తింపుకు తోడు, తమ ఊరిలో ప్రతి నాయకత్వం లేని పరిస్థితికి అలవాటై దేశమంతా అట్లే ఉందని ఊహా లోకంలో ఉన్నట్లు సమాచారం. అలాగే కూటమిలోని జట్టు 2 ఆధిపత్య ధోరణిని ఆదిలోనే సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ తమకే పూర్తి ఆధిపత్యం రావటం అంత తేలికేమీ కాదనీ, ఇప్పటి వరకూ బేరసారాలలోను కూటమి తో మాత్రమే విజయాల్ని పొందామని, మిగతా రెండు జట్లు భవిష్యత్తులో తమను అంత తేలిగ్గా దగ్గరికి రానివ్వవనీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లుంది. దానికి తోడు ప్రస్తుతము ‘తానా’ను నడపడం, కాన్ఫరెన్స్ చేయడం, నిలువుగా మళ్లి చీలిన కార్యవర్గాలతో నెట్టుకు రావడం కూడా కత్తి మీద సామే. అయితే తమకి అలవాటైన కొత్త సభ్యుల చేర్పింపును ప్రస్తుతము తమతో ఉన్న వారికి వంతుల వారీగా విభజించి చాప కింద నీరులా సాగిస్తుండడం మంచిదే కానీ వీరు ఎంత వరకు భవిష్యత్తులో కూడా తమతోనే ఉంటారనేది అనుమానమే కాగా అందుకు బేరసారాలాడే తమ గత చరిత్రే వారి అనుయాయులకు స్ఫూర్తి కావచ్చు. మిగతా పదవులకు వీరి అనుచర వర్గంలో అర్హులు ఉన్నప్పటికీ, తాము ‘తానా’ను నడుపుతూ ఉండాల్సిన భాద్యతను డిస్టర్బ్ చేయకుండా ఎన్నికల టీంను సారధ్యం వహించగలిగిన నాయకుడు దొరికితే టీం మొత్తం తమతోనే ఉండి విజయావకాశాలు కలిసి వస్తాయి అని తెలుసుకోవాలి. అందుకు తమ ఊరిలోనే గాక మిగతా ఊళ్లలోనూ, సభ్యుల్లోనూ గుర్తింపు పలుకుబడి ఉన్న పలువురిని త్వరలో ఆకట్టుకుంటే ఇదే మంచి టీం కూడా కావచ్చును. అలా కాక మిగతావారి తో కలిసినప్పుడు పొందిన విజయాల్ని తలకెక్కించుకొని, తాము చేసిందే రాజకీయం, తాము వేసిందే వ్యూహమంటూ మళ్ళీ కూటమి లేదా లోపాయకారి డీల్స్ తో ముందుకెళ్తే వీరిని బళ్లారి పంపించడానికి బస్సులతో రెడీ గా ఉన్నారని గమనిస్తారనుకుందాము.
ముక్తాయింపు: వివరించిన వివరాలు ఎంత నిజాలో అన్ని జట్లలోని వారికీ, ‘తానా’ వ్యవహారాలను గమనించే చాలామందికి ఎదో ఒక వైపైనా చాలావరకు తెలుసని ఒప్పుకుంటారు అని భావిస్తున్నాము. వెరసి ‘ఎవరికి వారే యమునా తీరే’ లా ఉన్న ఈ మూడు జట్లు రాబోయే రెండు నెలలు వేరే జట్లు మీద, వారి వ్యూహాల మీద ఆ జట్లలోకి పంపిన తమ సానుభూతి పరుల నుంచి సమాచారం సేకరిస్తూ డేగ కన్నులతో పరిశీలన జరుపుతూ ‘తానా’ లో కొత్త సభ్యులను (జనవరి 31 చివరి తేదీ) చేర్పించడానికి ఏర్పాట్లు చేస్థున్నారు. వెరసి రాబోయే టర్మ్ ఎన్నికలు ఈ మధ్యనే గత, ప్రస్థుత అధ్యక్షులు నిర్వహించిన ‘తెలంగాణ బతుకమ్మ’ , ‘తెలుగు దీపావళి’ ఈవెంట్లగా ఉండాలనీ ‘దేవరగట్టు బన్నీ జాతర’లో కర్రలతో తలలు పగిలేలా ఉండకూడదని ఆశిద్దాం. ‘తానా’ ను తెలుగు ప్రజల సేవ భాష/సంస్కృతి అభివృద్ధి లక్ష్యం గా ఉండే నాయకత్వం భవిష్యత్తు లోనైనా వస్తుందని కోరుకుందాం.
మరి ‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో ‘మాయాబజార్’ చిత్రంలోని ఓక శ్లోకం :
చిరంజీవ చిరంజీవ! సుఖీభవ సుఖీభవ !
చిన చేపను పేద చేప, చిన మాయను పెను మాయ ఆఁ ఆహా
అది స్వాహా, ఇది స్వాహా! అది స్వాహా, ఇది స్వాహా! ఆఁ ఆహా
చిరంజీవ చిరంజీవ! సుఖీభవ సుఖీభవ !
ఎరుక కుండా వచ్చావు, ఎరుక లేక పోతావు ఆఁ ఆహా
ఇది వేదం, ఇది వేదం ఆఁ ఆహా