ఏపీలో మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సీఎం జగన్ ఉపసంహరించుకోవడంపై టీడీపీ నేతలతోపాటు యావత్ ఆంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు జగన్ తన తప్పు తెలుసుకున్నారని, ఇప్పటికైనా ఏపీకి అమరావతే రాజధాని అని ప్రకటించాలని అంటున్నారు. మరోసారి జగన్ ప్రవేశపెట్టబోయే బిల్లులోనైనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న కాన్సెప్ట్ కు చట్టబద్ధత కల్పించాలని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ప్రభుత్వ౦ ఆలస్యమైనా మూడు రాజధానుల విషయంలో మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీ నేతలు ఇక్కడ భూములు దోచుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాజధాని ఒక చోటే ఉండాలని ప్రతిపక్ష నేతగా నేటి తుగ్లక్ సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారని అన్నారు.
ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతే అని చెప్పిన జగన్….ఇపుడు మాటమార్చారలని ధ్వజమెత్తారు. ఆ తర్వాత తాజాగా మూడు రాజధానులపై మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే, హైకోర్టుకి మాత్రమే ఈ నిర్ణయాన్ని చెప్పారని, రాధానిపై అసెంబ్లీలో చర్చించి చట్టం చేస్తేనే తాము నమ్ముతామని వెల్లడించారు. జగన్ తాజాగా చేసిన ప్రకటనను నమ్మడానికి లేదని, పూర్తి ప్రకటన వెలువడిన తర్వాతే ఈ విషయంపై స్పందిస్తామని అన్నారు. విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని అయ్యన్న నిలదీశారు..