రాజకీయ నాయకులు వేసే అడుగులకు అర్ధం.. పరమార్థం వేరేగా ఉంటాయి. ఇక, వ్యూహ ప్రతి వ్యూహాలు వేసే నాయకులు చేసే పనులకు మరింత లోతైన లక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చేస్తున్న పనులు కూడా ఈ కోవలోనే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ఇప్పటికేరెండు సార్లు వరుస విజయాలు దక్కించుకుని.. అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా అధికార పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనేక పథకాలు.. తీసుకువచ్చారు. సామాజిక వర్గాల వారీగా ప్రజలను మచ్చిక చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. అయినప్పటికీ.. ఎక్కడో ఏదో సందేహం. ఎక్కడో తేడా కొడుతుందనే భావన కేసీఆర్‌ను వెంటాడుతోంది. ఎన్ని పథకాలు అమలు చేసినా.. తిరిగి తనకు ప్రజలు జై కొడతారో.. లేదో .. అనే ఆవేదన ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం.. రాష్ట్రంలో యువ నాయకుడిగా.. ఫైర్ బ్రాండ్‌గా.. గుర్తింపు పొందిన కాంగ్రెస్ సారథి.. రేవంత్‌రెడ్డి.
రేవంత్ నాయకత్వంపై రెడ్ల ఆశ
రాజకీయంగా.. రేవంత్ రెడ్డి ఎంత దూకుడో అందరికీ తెలిసిందే. ప్రతి మాట ఒక తూటాలాగా పేల్చగల నేర్పరి. దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు.. వచ్చే ఎన్నికల నాటికి మారిపోయే అవకాశం ఉందని.. సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం రేవంత్ వెంట నడిచే అవకాశం ఉందని తలపోస్తున్నారు. ఇదే జరిగితే.. తెలంగాణ రెడ్లు.. రేవంత్ కు జై కొడితే.. కీలకమైన ఓటు బ్యాంకును కోల్పోవాల్సి ఉంటుంది. ఇదే నిజమైతే.. మూడో సారి అధికారంలోకి రావాలనుకున్న తన వ్యూహానికి పెద్ద గండి ఏర్పడుతుంది.
జగన్ తో వారికి వల
దీంతో ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో స్నేహం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో లబ్ధి పొందిన రెడ్డి సామాజిక వర్గానికి జగన్ అంటే విపరీతమైన అభిమానం. వీరిలో తెలంగాణ రెడ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను మచ్చిక చేసుకుంటే.. ఎలాగూ.. ఆయన పార్టీ తెలంగాణలో లేదు కనుక.. ఆయన ఇచ్చే పిలుపుతో .. తనకు వారుమద్దతు తెలిపే అవకాశం ఉంటుందని.. కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఉంది. నిజానికి ఆదిలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో మొత్తం రెడ్లందరినీ కేసీఆర్ కాకా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా 12 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తున్నక్రమంలో ఐదుగురు రెడ్లకు ఆయన సీట్లు కేటాయించారు. వీరిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎం.సీ కోటిరెడ్డి, యాదవరెడ్డి వంటివారు ఉన్నారు. అంటే.. ఇప్పుడు కేసీఆర్ వ్యూహం అంతా కూడా రేవంత్ కేంద్రంగానే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. అదేసమయంలో తెలంగాణ రెడ్లను మెప్పించడానికే జగన్ తో స్నేహం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
చంద్రబాబుతో ఉపయోగం లేదు
ఇక్కడ ఇంకో విషయం చర్చకు వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును దగ్గర చేసుకున్నా ఆ ఓట్లు తనకు పడవని కేసీఆర్ నమ్ముతున్నారు. చంద్రబాబుతో చేసే స్నేహం వల్ల ఓట్ల పరంగా ఉపయోగం లేదు కాబట్టి… రేవంత్ ని దెబ్బ కొట్టాలంటే రెడ్డి వర్గాన్ని దగ్గరకు తీయాలని, దీనికి జగన్ సరైన ఆయుధమని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే.. జగన్ తో స్నేహం వల్ల తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతినకుండా ప్రాజెక్టు గొడవలను తెరపైకి తెస్తున్నారనే వాదన కూడా ఉంది. అంటే.. తన కత్తికి రెండుపక్కలా పదును! అనే మాటను కేసీఆర్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.