పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్” పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పయున్ కోషియుం చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ తేదీ విషయంలో కొద్ది రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా 2022 ‘జనవరి 12న ఈ సినిమా విడుదల కానుందని చాలారోజుల క్రితమే చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కానీ, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కాబోతుండడంతో భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడబోతోందని ప్రచారం జరిగింది. జనవరి 13న విడుదల కావాల్సిన మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ కూడా ఏప్రిల్ 1వ తేదీకి విడుదల తేదీని వాయిదా వేసుకుంది.
దీంతో, ‘భీమ్లా నాయక్’ విడుదల కూడా వాయిదా పడిందని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడలేదనే చెబుతూ రిలీజ్ డేట్ తో సహా తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా చిత్ర నిర్మాతలు ఇచ్చిన అప్డేట్ తో ఈ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని తేలింది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, రిలీజ్ డేట్ విషయంలో బాబాయ్, అబ్బాయ్ తగ్గేదేలే అంటున్నారని సోషల్ మీడియాలో మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.