ఖాళీలు తక్కువ.. ఆశావహులు ఎక్కువ.. ఒకరికి అవకాశమిచ్చి మరొకరికి అన్యాయం చేస్తే వాళ్లు పార్టీ మారుతారేమోననే భయం.. అందరికీ పదవి ఇవ్వలంటే కుదరని పరిస్థితి.. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇలాంటి సంకట స్థితిలోనే ఉన్నారు. అందుకే ఇప్పుడు పదవులు దక్కని వాళ్లకు భవిష్యత్‌లో కచ్చితంగా మెరుగైన ప్రాధాన్యత కల్పిస్తానని ఆశ చూపి ఆయన బుజ్జగిస్తున్నారు.
ఇదంతా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆయనకు వచ్చిన తలనొప్పిలా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ముందుగా ఎమ్మెల్యే శాసన సభ్యుల కోటా కింద ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల కోటా కింద 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో టీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటా కింద ఎవరిని శాసన మండలికి పంపాలి అనే విషయంపై కేసీఆర్ ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఆ ఆరు స్థానాలకు గాను కేసీఆర్ కొంతమంది పేర్లను ఫైనల్ చేసినట్లు తెలిసింది. అందులో చివరకు ఒకరిద్దరు పేర్లలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన విషయంలో కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పురాణం సతీష్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, భూపాల్ రెడ్డి, చిన్నపరెడ్డి, కవిత, నారదాసు లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, భానుప్రసాద్ రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజుల పదవీ కాలం జనవరి నాలుగుతో ముగుస్తుంది.
వీళ్లలో కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేర చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఉప ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీలయ్యారు. వీళ్లు రెండేళ్ల నుంచే పదవిలో కొనసాగుతండడంతో ఈ నలుగురికి మరోసారి అవకాశం ఇచ్చే వీలుంది. ఇక మిగిలిన స్థానాల కోసం ఆశపడుతున్న వాళ్ల జాబితా పెద్దగానే ఉందని తెలిసింది.
సామాజిక సమీకరణాలతో పాటు రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వాళ్లను ఈ రేసు నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం. పట్నం మహేందర్ రెడ్డి లాంటి నాయకులు ఎమ్మెల్యే సీటు కావాలని డిమాండ్ చేస్తున్నారని టాక్. అలాంటి వాళ్లకు వాళ్లు కోరుకున్న మేరకు హామీనిచ్చి ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పించాలని కేసీఆర్ చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వాళ్లలోనూ కొంతమందికి ఈ రకమైన హామీలనే కేసీఆర్ ఇచ్చి బుజ్జగిస్తారని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ నుంచి నేతలను లాగే పనిలో బీజేపీ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ నేతలు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ముందే ఆ ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్ ఇలా హామీలు బుజ్జగింపులతో వాళ్లను పార్టీలోనే కొనసాగేలా చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.