సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు దేశంలో మరెక్కడా లేవని, కేవలం ఏపీలోనే ఉన్నాయని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. నవరత్నాలతో జనం జీవితాలు మార్చేస్తానని జగన్ డబ్బా కొట్టుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, నవరత్నాల పేరుతో జనం కళ్లకు గంతలు కట్టిన జగన్….గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను తిలోదకాలిచ్చారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అన్న క్యాంటీన్, సంక్రాంతి కాను, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, పసుపు కుంకుమ పథకం, దివ్య దర్శనం, చంద్రన్న పెళ్లి కానుక, బాలామృతం, ఉచిత ఇసుక, ఎన్టీఆర్ హౌసింగ్, రైతు రథం, అన్న అభయ హస్తం, బడి పిలుస్తోంది, గిరి గోరు ముద్ద, ద్రోణాచార్య పథకం, దుకాన్ మకాన్ పథకం, రోష్నీ పథకం, చంద్రన్న విదేశీ విద్య…ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇవన్నీ పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత కేవలం చంద్రబాబు మీద కక్ష సాధించాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఈ పథకాలకు తూట్లు పొడిచారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, 9 పథకాలు ఇస్తున్నామని చెబుతున్న జగన్ రెడ్డి గారు..90 పథకాలను సమూలంగా తుడిచిపెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు. నకిలీ రత్నాలు చూపించి రద్దుల రెడ్డి జగన్ రద్దు చేసిన పథకాల జాబితా ఇదని మండిపడుతున్నారు.