డొల్లగా మారిన ఖజానా నింపుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్…ఇపుడు మద్యంపై పడ్డారు. ఏపీలో మద్యనిషేధం తెస్తానని కంకణం కట్టుకున్న జగన్ …ఆదిశగా అడుగులు వేస్తున్నానని చెబుతూ ఆబ్కారీ శాఖ నుంచి ఆదాయాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మద్య నిషేధం ముసుగులో నాసిరకం మద్యం బ్రాండ్లు, జగన్ బినామీల సొంత కంపెనీలు వెలిశాయని విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
అయినా సరే మద్యంపై తగ్గేదే లే అంటోన్న జగన్…తాజాగా మద్యంపై వ్యాట్ బాదుడుతో మందుబాబులకు షాకిచ్చారు. తాజాగా మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది జగన్ సర్కార్.
రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం వరకు వ్యాట్ విధించింది. రూ.400-2,500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలు చేయనుంది. ఇక, రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్, రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్ వడ్డించేందుకు సిద్ధమైంది. ఇక, రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించింది. దేశీయ తయారీ బీర్ కేసుపై రూ.200 కంటే తక్కువ ధర ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్ భారం పడనుంది.
రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించబోతున్నారు. ఇక, అన్ని రకాల మద్యం బాటిళ్లపై 35 శాతం వ్యాట్ విధించేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమైంది. రెడీ టు డ్రింక్లపై 50 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, తాజాగా మందుబాబులకు జగన్ షాకిచ్చినట్లయింది.