నిన్న దీపావళి వేడుకలు జరుపుకున్న అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో తారక్ చేతికి కట్టు కట్టి ఉండటం చూసి అభిమానులు కంగారు పడిపోయారు.
ఎన్టీఆర్ చేతికేమైందంటూ ఆరాలు తీయడం.. చర్చలు పెట్టడం చేశారు. ఐతే దీనిపై మీడియాకు ఎన్టీఆర్ పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. తన ఇంట్లోని పర్సనల్ జిమ్‌లో తారక్ వ్యాయామం చేస్తుండగా.. కుడి చేతి వేలికి ఫ్రాక్చర్ అయిందట.
ముందు ఈ గాయాన్ని లైట్ తీసుకున్నా.. తర్వాత నొప్పి ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ తీశారట. దీంతో ఆసుపత్రిలో చిన్న పాటి సర్జరీ చేయించుకున్నాడు తారక్. ఈ క్రమంలోనే తారక్ ఆ కట్టుతో కనిపించాడు. తారక్ కొన్ని రోజుల పాటు బయట ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడు. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోనున్నాడు.
గాయం చిన్నది, సర్జరీ కూడా చిన్నపాటిదే కావడంతో అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి షూటింగ్ అంతా ఎప్పుడో అయిపోయింది.
ఆ తర్వాత తారక్.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో షూటింగ్లో పాల్గొంటూ వచ్చాడు. ఆ షో తొలి సీజన్‌కు సంబంధించి షూట్ అంతా కూడా అయిపోయింది. తర్వాతి సీజన్లో తారక్ కొనసాగుతాడో లేదో అన్నదానిపై స్పష్టత లేదు. ఇక తారక్ ఫోకస్ అంతా కొరటాల శివ సినిమా మీదికి వెళ్లనుంది.
కొరటాల ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్టు పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో, లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
కొరటాల మిత్రుడు మిక్కిలేని సుధాకర్, తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్న సంగతి తెలిసిందే.