మాస్ కా బాప్, నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా స్ట్రీమ్ అయిన ఈ షో తొలి ఎపిసోడ్ లో గెస్ట్స్ గా టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, నటి, నిర్మాత మంచు లక్ష్మి, హీరో మంచు విష్ణు వచ్చారు. ఈ షో సందర్భంగా బాలయ్య, మోహన్ బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఒకరిపై ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ…చివరకు రాజకీయాలవైపునకు వెళ్లి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు.
“నా అంతరాత్మకు అంతరాయం ఉండదంటారు –నా మనస్తత్వానికి మర్మం లేదంటారు –కోపమెక్కువే కానీ, కపటం తెలియదంటారు –
కానీ కన్ను కదిపిన నాటి నుంచీ కట్టె కాలేదాకా ఈ క్యారెక్టర్ మారదు…” అన్న వాయిస్ ఓవర్ తో ‘పైసావసూల్’లోని “మామా ఏక్ పెగ్ లా…” పాటకు బాలయ్య స్టెప్పులేస్తూ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. “అనిపించింది అందాం… అనుకున్నది చేద్దాం… ఎవడాపుతాడో చూద్దాం…” అని బాలయ్య చెప్పిన షో పంచ్ డైలాగ్ కేక పుట్టించింది. బాలయ్య, నటి పూర్ణ కలిసి ‘సమరసింహారెడ్డి’లోని “నందమూరి నాయకా…” పాటకు స్టెప్స్ వేయడం ఆకట్టుకుంది.
‘చిరంజీవిగారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయమేమిటి చెప్పండి?’ అన్న ప్రశ్నకు మోహన్ బాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. “చిరంజీవి మంచినటుడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు… నాకు పర్సనల్ గా అతడిమీద ఏ విధమైన చెడు అభిప్రాయం లేదు… అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్ళిచేసుకున్నాడు… ఆమె నాకు సిస్టర్ లాంటిదే కదా… అంటే మన ఇంటి అమ్మాయిని అతడు పెళ్ళి చేసుకున్నాడు… కాబట్టి అతడు బాగున్నాడు..” అని మోహన్ బాబు చెప్పడం ఆసక్తి రేకెత్తించింది.
చిన్నప్పుడు తాను ఎక్కువసార్లు ‘మంగమ్మగారి మనవడు’లోని “దంచవే మేనత్త కూతురా…” పాటకు డాన్స్ చేసే దాన్నని మంచు లక్ష్మి చెప్పడంతో…ఆ పాటకు బాలయ్య, లక్ష్మితో కలిసి ఆ పాటకు స్టెప్పులేయడం ఈ షోకే హైలైట్. తమ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సలహా సంఘంలో బాలయ్యను, తండ్రి మోహన్ బాబును సభ్యులుగా ఉండమని మంచు విష్ణు కోరడం కొంత ఆసక్తి రేకెత్తించింది.
మహానుభావుడు ఎన్టీఆర్ తనకు క్రమశిక్షణ ఉందని కితాబిచ్చారని మోహన్ బాబు గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లోని గత అనుభవాలను చెప్పుకొచచారు. 90వ దశకంలో ఇందిరాగాంధీపై వారసత్వ రాజకీయాలు ఉండరాదని పోరాటం చేస్తున్నామని, అందుకే తాను రాజకీయాలవైపు ఆనాడు ఆసక్తి చూపలేదని మోహన్ బాబు అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానమిచ్చారు.