తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతల్ని తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారా? నేతల్ని మాత్రమే చూస్తూ.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని పట్టించుకోకుండా గెలిపించే విషయంలో ముందుంటారా? అన్న ప్రశ్నలకు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం నిజమని స్పష్టం చేస్తోంది.
హోరాహోరీగా తలపడిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల విజయంతో పాత సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ఆ తర్వాత కేసీఆర్ తో పడక టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారు బీజేపీలో చేరటం.. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే సెంటిమెంట్ పాతదే.
ఇప్పుడు ఈటల విజయంతో మరోసారి రిపీట్ అయ్యిందని చెప్పాలి. తొమ్మిదేళ్ల క్రితం మొదలైన ఈ సెంటిమెంట్.. తాజా ఈటల విజయంతో మరోసారి అందరూ గుర్తు చేసుకునే పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందే 2012లో మహబాబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన యెన్నెం శ్రీనివాసరెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది. అప్పట్లో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో 1779 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై గెలుపొందారు.
అదే రీతిలో 2020లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించటంతో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది.
ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉద్యమకారుడు.. బీజేపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు బరిలోకి దిగారు.
అనూహ్య ఫలితాలతో బీజేపీ అభ్యర్థిపై సంచలన విజయాన్ని నమోదు చేశారు. 2018లో పోటీ చేసినప్పుడు మూడో స్థానానికి పరిమితమైన రఘునందన్.. 2020 ఉప ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే కావటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన హూజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుడు.. టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగటం.. పాత సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయి బీజేపీకి విజయానందం దక్కితే.. టీఆర్ఎస్ కు ఓటమి భారం మిగిలింది.