బీజేపీ కోరి మరీ పరువు బజారున పడేసుకుంది. ప్రధాన పార్టీలు సానుభూతికి వదిలేసిన ఎన్నికల్లో పోటీ చేస్తే అవన్నీ తమకే పడతాయన్న దురాశతో పోటీ చేసి ఉన్న పరువు కూడా పోగొట్టుకుంది.
ఓటేస్తే తమకు నచ్చిన పార్టీలకు వేస్తాం గాని… బీజేపీకి వేసే సీన్ లేదని ఓటరు తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) మంగళవారం జరిగిన బద్వేల్ అసెంబ్లీ స్థానాన్ని 90 వేలకు పైగా ఓట్ల ఆధిక్యత సాధించింది. తెలుగుదేశం జనసేన పోటీ పెట్టకపోవడంతో వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకలా అయింది.
ఏపీలో చిరునామా లేని బీజేపీ, కాంగ్రెస్ లు కేవలం జగన్ పార్టీ రికార్డు కోసం పోటీ చేశాయి. ఏ పార్టీ లేకపోయినా డిపాజిట్లు రాకపోవడంతో ఇక కాంగ్రెస్ కు ఏపీలో ఛాన్సే లేదని మరోసారి తేలిపోయింది.
ఏకపక్షంగా జరిగిన పోటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి పానతల సురేష్‌పై 90,533 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గంలో సుధ 1,12,211 ఓట్లు సాధించగా, సురేష్ 21,678 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన కమలమ్మకు కేవలం 6,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. గెలిచిన సుధ మినహా అభ్యర్థులందరూ డిపాజిట్‌ను కోల్పోయారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో కడప లోక్‌సభ స్ధానంలో ఒకటైన బద్వేల్లో మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 14 మంది డిపాజిట్ కోల్పోయారు.
మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మద్దతు ఇచ్చే సంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పోటీకి దూరంగా ఉంది. ఇదే చోట
2019లో వైఎస్ఆర్సీపీకి చెందిన వెంకటసుబ్బయ్య తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఓబుళాపురం రాజశేఖర్‌పై 44,734 ఓట్ల తేడాతో విజయం సాధించారు.