హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దాదాపు 30 వేల మెజార్టీతో గెలవబోతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కు ఈటల భారీ షాకివ్వబోతున్నారని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఐదు నెలల్లోనే 5 వేల కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. శత్రువుకు శత్రువు మిత్రుడని, అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటలకు తాము మద్దతు ఇవ్వక తప్పలేదని వెల్లడించారు.
ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలికతో కేసీఆర్ గెలిచి మళ్లీ ప్రజలను మభ్యపెడతారని విమర్శించారు. అందుకే ఈసారి తాము కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఈటలకు పరోక్షంగా మద్దుతు ఇవ్వాల్సి వచ్చిందని కోమటిరెడ్డి తెలిపారు. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ పార్టీకే లబ్ది కలిగేదని చెప్పారు.
మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు చెబుతున్నదానికి విరుద్ధంగా కోమటి రెడ్డి మాట్లాడి ఆ పార్టీలో కలకలం రేపారు. ఈటల వర్సెస్ టీఆర్ఎస్గా హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగాయనేది అందరి వాదన ఇదే. అయితే ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్‌లో కమలం వికసించకూడదనే పట్టుదలతో కాంగ్రెస్ అధినాయకత్వం పనిచేసిందనట్లు తెలుస్తోంది.
కారు గెలిచినా పర్వాలేదుకానీ.. బీజేపీ ఓడిపోవాలని కాంగ్రెస్ కోరుకుంది. దీనికి ఆ పార్టీ నేతలు అనేక కారణాలు చెప్పారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. అయితే బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం కాంగ్రెస్‌పై భారీగా ఉండుతుందని ముందే ఊహించారు.
ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపి తన సత్తా చాటనుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయినే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో ఉంది. అందుకోసమే హుజురాబాద్ లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట.
అయితే అందుకు విరుద్ధంగా తాము ఈటల గెలుపు కోసం పరోక్షంగా మద్దతు ఇచ్చామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందింస్తుందో వేచిచూడాలి.