- పది నెలలైనా అందని పదవీ విరమణ ప్రయోజనాలు
- ఆరు నెలల నుంచి పీఎఫ్ లేదు
- ఏడాది నుంచి బీమా బాండ్లకు డబ్బుల్లేవు
- అసలు సొమ్మూ ఇవ్వరు.. వడ్డీ కూడా రాదు
- పిల్లల చదువులు, పెళ్లిళ్లకు
- సొమ్ము చేతికందక ఇబ్బందులు
- ప్రైవేటు అప్పులతో వడ్డీల భారం
నవ్యాంధ్రలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగుల గోడు అరణ్య రోదనగా మారింది. జగన్ ప్రభుత్వం నిధులన్నీ స్వాహా చేస్తుండడంతో పదవీవిరమణ ప్రయోజనాలు అందక వారు విలవిలలాడుతున్నారు. రామారావు ఓ ఉపాధ్యాయుడు. 35ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. పిల్లలను చదివించుకున్నారు. ఒక ఇల్లు కొనుగోలు చేశారు. వాటికోసం కొన్ని అప్పులూ చేశారు.
వాటన్నింటినీ నెలనెలా వాయిదాల్లో తీర్చేందుకు ఇక జీతం రాదు. దీంతో తన పదవీ విరమణ నాడు వచ్చే ప్రయోజనాలపై ఆయన ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయన పదవీ విరమణ చేసినా.. రావలసిన ప్రావిడెంట్ ఫండ్, అదేవిధంగా గడువు తీరిన ప్రభుత్వ బీమా బాండ్లు(ఏపీజీఎల్ఐ) సొమ్ము చేతికందడం లేదు.
రిటైర్మెంట్ డబ్బుతో గృహరుణంలో మిగిలిన రుణమొత్తం చెల్లింపు చేసేద్దాం, పిల్ల పెళ్లి చేద్దామంటే డబ్బు చేతికి రావడం లేదు. దీంతో అవసరం ఆగదు కాబట్టి బయటి నుంచి అప్పులు తేవాల్సిన పరిస్థితి. తెస్తే వడ్డీ కట్టాల్సిన దుస్థితి. ఇక్కడేమో పదవీ విరమణ తేదీ తర్వాత ఎంతకాలం పీఎఫ్ సొమ్ము ఇవ్వకున్నా దానికి వడ్డీ చెల్లించరు. ఏపీజీఎస్ఐ బాండ్లకు కూడా గడువు తీరి ఎంతకాలమైనా…ఈ ఆలస్యమైన సమయానికి వడ్డీ చెల్లింపు ఉండదు. కానీ ఈ ప్రయోజనాలు రాకపోవడంతో బయటతెచ్చే అప్పులకు మాత్రం వడ్డీలు బారెడు కట్టాలి.
అంతా తల్లకిందులు..
ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో రిటైర్మెంట్ రోజునే పదవీ విరమణ ప్రయోజనాలన్నీ అందించేవారు. వారికి ఘనంగా వీడ్కోలు పలికి సన్మానం చేసి రిటైర్మెంట్ సమయంలో వచ్చే ప్రయోజనాలన్నీ అందించేవారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది.
పదవీ విరమణ చేసి పది నెలలవుతున్నా పీఎఫ్ మొత్తం రాలేదు. ఏడాదికాలం నుంచీ ఏపీజీఎల్ఐ మొత్తం రాలేదు. జూలై నెలలో ఏపీజీఎల్ఐ కోసం రూ.235 కోట్లు మంజూరుచేస్తూ ప్రభుత్వం ఆర్భాటంగా ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఏడాదినుంచి పడిన కష్టాలు తీరిపోతాయి. మన సొమ్ము మనకొస్తుందని సంతోషపడ్డారు. కానీ జీవో వచ్చి రెండు నెలలవుతున్నా ఇంతవరకూ ఖాతాల్లో డబ్బు పడలేదు.
ఎందుకంటే ప్రభుత్వం ఆ మొత్తం మంజూరు మాత్రమే చే సింది.. పైసా కూడా విడుదల చేయలేదు. ఉద్యోగులు తమ జీతంలో నెలనెలా కొంత కట్ చేసుకుని ఈ బాండ్లు కొనుక్కున్నారు. బాండ్లు గడువు తీరిన వెంటనే ఈ డబ్బులు చెల్లించాలి. అంటే వారు దాచుకున్న సొమ్ము వారికివ్వాలి. ఇలాంటివాటి చెల్లింపులు కూడా ఆలస్యం కావడం దారుణమని పలువురు వాపోతున్నారు.
ప్రతి ఉద్యోగికి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఈ బీమా బాండ్ల సొమ్ము రావలసి ఉందని అంచనా. మరోవైపు ఉద్యోగులకు అత్యధికంగా అక్కరకొచ్చేది వారి ప్రావిడెంట్ ఫండ్ సొమ్మే. నెలనెలా పొదుపుచేసుకుని, పదవీ విరమణ నాటికి ఒక భరోసాగా ఉండే మొత్తం ఇది. ఆ తర్వాత జీతం రాదు కాబట్టి…ఉన్న అవసరాలన్నింటికీ గంపగుత్తగా అక్కరకొచ్చేది ఇదే. కానీ ఇది కూడా గత ఆరు నెలల నుంచీ ఉద్యోగులకు రావడం లేదు.
ఇది వందల కోట్లలో ఉంది. ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.10నుంచి రూ.30లక్షల వరకు ఈ పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిపై ఆ ఉద్యోగి కుటుంబం, వారి అవసరాలు అన్నీ ఆధారపడి ఉన్నాయి. పదవీ విరమణ చేశాక ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో వీటికోసం ఎదురుచూడడం నరకప్రాయంగా ఉందని వారు వాపోతున్నారు.
రిటైర్మెంట్ నాటికి అనేక ఖర్చులకు తగినట్లుగా…ఈ పీఎఫ్ సొమ్మును పంచేందుకు ప్రణాళికలు వేసుకున్నామని.. ఇప్పుడు ఆలస్యమయ్యేసరికి బయట అప్పులు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు సర్వీసులో ఉండగా అంటే ఈ పీఎఫ్ మొత్తానికి వడ్డీ చెల్లిస్తారు. రిటైరైన తర్వాత వడ్డీ ఉండదు. ఒకటి, రెండు నెలలు అంటే ఫర్వాలేదని.. కానీ ఇంత కాలం పాటు చెల్లించకపోతే తామేం కావాలని బావురుమంటున్నారు.