ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారంలోకి రెండున్నరేళ్లు అయిన వేళ.. గతంలో చెప్పినట్లుగా మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్నవేళ.. అందుకు భిన్నంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కొత్త చర్చకు తెర తీసింది. డిప్యూటీ సీఎంగా వ్యవమరిస్తున్న నారాయణస్వామి నుంచి కీలక శాఖను ఆయనకు తప్పించి.. మరో మంత్రి బుగ్గనకు బదిలీ చేయటం ఆసక్తికరంగా మారింది.
డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న నారాయణ స్వామి జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్.. వాణిజ్య పన్నుల శాఖను నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయన వద్దనున్న రెండు శాఖల్లో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను ఆయన నుంచి తప్పించి.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాజాగా జారీ చేశారు.
ప్రస్తుతం ఆర్థిక.. ప్రణాళిక.. శాసనసభా వ్యవహారాల్ని చూస్తున్న బుగ్గన.. తాజాగా వాణిజ్య పన్నుల శాఖను చూసుకోనున్నారు. త్వరలో మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేస్తారన్న చర్చ జరుగుతున్న వేళ.. డిప్యూటీ సీఎం మంత్రిత్వ శాఖను మార్చటం చూస్తుంటే.. కేబినెట్ మార్చే అంశంపై జగన్ ఇప్పట్లో నిర్ణయం తీసుకోరా? అన్న కొత్త సందేహం వ్యక్తమవుతోంది.
నారాయణస్వామి విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2004లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. వైసీపీ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ను విడిచి పెట్టి జగన్ వెంట నడిచారు. అనంతరం గంగాధర నెల్లూరు నుంచి 2014, 2019లో గెలిచిన ఆయన మంత్రి కమ్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయుడిగా.. ఆయనకు అనుచరుడిగా పేరుంది. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉన్న ఆయనకు జగన్ తన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్పారు. ఇటీవల కాలంలో ఆయన పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది.
ఈ మధ్యన జనసేనానిని టార్గెట్ చేసే క్రమంలో ఆయన్ను తిట్టబోయిన నారాయణస్వామి.. సీఎం జగన్ పేరును పొరపాటున పలకటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్.. షర్మిల విభేదాల మీద మాట్లాడే సాహసం చేసిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఇలా తరచూ వార్తల్లో వస్తున్న ఆయనకున్న మంత్రిత్వ శాఖలకు కోత విధించటం కొత్త చర్చకు అవకాశం ఇచ్చినట్లైంది.