ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదన్న కాన్సెప్ట్ తో ముందుకు వెళ్లిన కేసీఆర్…ఆ దిశగా చాలామంది నేతలను ఏదో రకంగా గులాబీ తీర్థం పుచ్చుకునేలా చేశారని విపక్షనేతలు ఆరోపిస్తుంటారు. ఇక, ఇదే ఫార్ములాను ఏపీలో జగన్ కూడా ఫాలో అవుతున్నారని, కేసీఆర్ అడుగుజాడల్లోనే జగన్ నడుసస్తున్నారని ఏపీ విపక్ష నేతలు విమర్శిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే జగన్, కేసీఆర్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, వైసీపీ ఒక్కటేనని….జగన్, కేసీఆర్ వేరు వేరు కాదని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. దీని వెనుక బీజేపీ ఉందని, కేసీఆర్ నాడి తనకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణలో ఇకపై ఎలాంటి ఉద్యమాలు రావని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు.
ఏపీ, తెలంగాణ నాయకుల మధ్య విచిత్రమైన చర్చ జరుగుతోందని, రాష్ట్రం విడిపోక ముందు ఒకలా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరోలా చర్చ జరుగుతోందని అన్నారు. సమైక్యంగా ఉంటే బాగుండు అనే కోణంలో మాట్లాడుకుంటున్నారని, ఉద్యోగులు, విద్యార్థుల్లో అసంతృప్తి కనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన మూడేళ్ళకే సమైక్య రాష్ట్రం చర్చ వచ్చిందని చెప్పారు. గతంలోనే ఈ విషయాన్ని తాను చెప్పానని, ఇప్పుడంతా అదే విషయం మాట్లాడుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పీసీసీ చీఫ్ హోదాలో అన్నవని, రెండు రాష్ట్రాలు కలుపుతా అంటే కేసీఆర్ కు సహకరిస్తానని జగ్గారెడ్డి అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు సమర్ధనీయం అని చెప్పారు. వ్యక్తిగతంగా తన అభిప్రాయం చెబుతున్నానని అన్నారు. కేసీఆర్ ఒక గేమ్ ఆడుతున్నారని, ఆయన మాట్లాడిన మాటలకు నిగూడార్థం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ట్రాప్ లో తాను పడలేదని , కాంగ్రెస్ ను తొక్కే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు