మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలలుగా ఈ కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ…పులివెందులలో మకాం వేసి పలువురు అనుమానితులను ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్ తో పాటు గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలను సీబీఐ అధికారులు గంటల తరబడి విచారణ జరిపారు.
నాలుగు నెలల విచారణ అనంతరం ఈ కేసు విచారణలో సీబీఐ కీలక అడుగు వేసింది. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. వివేకా హత్యకేసులో గంగిరెడ్డి, సునీల్ యాదశ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిలపై అభియోగాలు మోపుతూ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. వివేకా మర్డర్ కు ఆ నలుగురే కారణమంటూ సీబీఐ ఛార్జిషీట్ లో వెల్లడించడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు, ఈ కేసులో నిందితులను ఆగస్టు, సెప్టెంబర్‌లో అరెస్టు చేశామని, ఆ తర్వాత వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని కూడా పేర్కొంది. నలుగురు నిందితుల్లో ఇద్దరు కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మరో ఇద్దరు బెయిల్ పై ఉన్నారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలతో కూడా నాలుగైదు బండిల్స్‌ను చార్జిషీట్ తో పాటు సీబీఐ అధికారులు సమర్పించారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఛార్జిషీట్ కాపీ ఒకటి తనకు ఇప్పించాలని కోర్టుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ కేసులో సునీల్, ఉమా శంకర్ లదే కీలక పాత్ర అని తెలుస్తోంది. వివేకా హత్యకు ముందే రెక్కీ నిర్వహించి…ఆ తర్వాత ఇంట్లోని కుక్కను సునీల్, ఉమాశంకర్ లు కారుతో ఢీకొట్టి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. బైకుపై వెళ్లిన సునీల్, ఉమా శంకర్ లు హత్య చేసి పారిపోయారని తెలుస్తోంది. ఉమాశంకర్ బైకులో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని, ఆ బైకు, గొడ్డలిని సీబీఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో పెద్దవాళ్ల హస్తం ఉందని, వారి పేర్లు తెరపైకి రావడం లేదని విమర్శలు వస్తున్నాయి.