టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడుల ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల వ్యవహారంతో పాటు ఏపీలో పోలీసుల తీరు, ప్రతిపక్షాలపై అధికార పార్టీ దారుణాలు వంటి పలు విషయాలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో ఒక ఉన్మాది పాలన నడుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని చంద్రబాబు కోరారు.
ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. అయితే, నిన్న మధ్యాహ్నం వరకు జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న షా అక్కడ నుంచి ఢిల్లీ చేరుకోవడంలో జాప్యం జరగడం, నిన్న సాయంత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో, చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దొరకలేదంటూ వైసీపీ నేతలు రకరకాల విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ విమర్శకుల నోళ్లు మూయించేలా…తాజాగా చంద్రబాబుకు అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ముందుగా షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ లు ఉండడంతో కలవడం కుదరలేదని, మరోసారి కలుద్దామని చంద్రబాబుకు షా చెప్పారు. ఏపీలో పరిణామాలను షా అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని దారుణ పరిస్థితులపై వినతి పత్రాన్ని పంపుతున్నామని షాకు చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందని, టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు వంటి పలు విషయాలను షాకు చంద్రబాబు వివరించారు. ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దేశవ్యాప్త గంజాయి రవాణాకు ఏపీలో మూలాలు వంటివి వివరించారు. ఏపీలో ఆర్టికల్ 356 తప్పదని తెలిపారు. ఆధారాలతో సహా వీడియో పంపుతానని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.