అప్పట్లో కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ-వైసీపీ.. ఏపీ పీక నులిమేస్తున్నాయా?
ఔను! ఇప్పుడు ఈ మాటే సర్వత్రా వినిపిస్తోంది. నవనవోన్మేషంగా వెలుగు చిందించాల్సిన నవ్యాంధ్ర.. ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలోను.. వెనుకబాటుకు కేరాఫ్కు మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘ తీర ప్రాంతం ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీని వెనుక.. అప్పట్లో కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ-వైసీపీ ప్రభుత్వాలు ఆడుతున్న రాజకీయ క్రీడలు చాలానే కనిపిస్తున్నాయి. తన రాజకీయ లబ్ధి కోసం.. అప్పట్లో హడువుడిగా రాష్ట్ర విభజనను చేపట్టిన కాంగ్రెస్.. కీలకమైన ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించలేదు. కేవలం మాట మాత్రంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాపై ఓ ప్రకటన చేసి సరిపుచ్చారు.
ఫలితంగా తర్వాత వచ్చిన బీజేపీ నేతృత్వలో ఎన్డీ యే ప్రభుత్వం హోదాను పూర్తిగా పక్కన పెట్టింది. ఇది రాష్ట్రానికి తగిలిన పెను దెబ్బ!. పోనీ.. దీని స్థానంలో ఇస్తామన్న.. ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్రం అటకెక్కించింది. ఇది మరో విఘాతం. ఇక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఆడుతున్న ఆటలు అన్నీ ఇన్నీ కావు. ద్రవ్యోల్బణాన్ని లెక్కించుకున్నా.. ధరలు పెరుగుతున్నాయనే విషయం సామాన్యలకు సైతం అర్ధమవుతున్నా.. కేంద్రానికి మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో అర్ధం కావడం లేదు. దీని వ్యయాన్ని ఎప్పుడో 2014లో నిర్ణయించిన ధరలకే పరమితం చేయడం ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది.
ఈ రెండు పార్టీలు ఇలా చేస్తే.. ఇక, రాష్ట్రంలో ఒక్కఛాన్స్ అంటూ.. అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారు.. మరింతగా రాష్ట్ర పురోగతికి అడుగడుగునా అడ్డుకట్టలు వేస్తోంది. కీలకమైన రాజధాని అమరావతిని మొగ్గలోనే చిదిమేసే ప్రయత్నం చేస్తోంది. పథకాల పేరిట వివిధ రూపాల్లో ప్రజలకు వేల కోట్ల రూపాయలు పంచుతున్న ప్రభుత్వం అమరావతి విషయానికి వచ్చే సరికి .. మాత్రం నిధులు లేవని కబుర్లు చెబుతోంది. కులం ప్రాతిపదికన రాజధానిని ఆదిలోనే అంతం చేస్తోంది. ఇక, భారీ తీర ప్రాంతం ఉన్నప్పటికీ.. చెప్పుకోదగ్గ అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకొన్న సంకల్పాన్ని సీఎం జగన్ తన స్వలాభం కోసం ఏనాడో త్యజించారన్నది నిష్టుర సత్యం.
మరి ఇంత జరుగుతున్నా.. ఆది నుంచి నవ్యంధ్రకు అన్యాయం జరుగుతున్నా.. ఏ ఒక్కపార్టీ కానీ.. ఏ ఒక్క నాయకుడు కానీ.. తెరమీద కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాలుగు మాటలు అనేసి తలుపులు మూసేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు.. కేంద్రాన్ని పన్నెత్తు మాట అనడం లేదు. ఇక, ప్రశ్నిస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడెదరు? రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేదెవరు? అనే ప్రశ్నకు సమీప దూరంలో ఎక్కడా సమాధానం కనిపించకపోవడం గమనార్హం.