ఏపీలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు, కార్యాలయాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తుండడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ దాడుల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం….ఈ క్రమంలోనే రాష్ట్రపతితో రేపు చంద్రబాబు భేటీ కావడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ వర్గం మీడియా కార్యాలయాలపై కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడే అవకాశముందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ఈ పుకార్లపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తనదైన శైలిలో ‘వీకెండ్ కామెంట్’ చేశారు. ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ ఉన్న ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’లో రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు నాట బూతు రసం తెప్పలుగా పారుతోందా? డ్రైనేజ్ స్కీమ్ లేక అది డేంజర్ గా మారుతోందా అంటూ ఆర్కే ప్రశ్నలు సంధించారు. ఏపీ రాజకీయాల్లో బూతులు, తిట్లు సర్వ సాధారణంగా మారడానికి కారణం ఎవరని ఆర్కే నిలదీశారు. టీడీపీ నేత పట్టాభి…జగన్ ను ఉద్దేశించి అన్న ఒక్క మాట వైసీపీలో రక్తపోటుకు ఎలా కారణమైందని ఆర్కే ప్రశ్నించారు. ఆ మాటను అడ్డుపెట్టుకొని టీడీపీపై దాడులు సమర్థనీయమా? అని ఆయన ప్రశ్నించారు.
బూతులకు ఆద్యులైన వైసీపీ నేతలు ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నారని, చంద్రబాబును వైసీపీ నేతలు బూతులు తిట్టినపుడు సంతోషించిన జగన్ కు ఇపుడు రక్తపోటు ఎందుకు వస్తోందని ఆర్కే ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ తిట్లకు చంద్రబాబు ఇలాగే స్పందించి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవని ఆర్కే నిలదీశారు. ఒక్క వ్యాఖ్యకే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే…జగన్ ఎన్నిసార్లు సారీ చెప్పాలో లెక్కవేసుకోవాలని సూచించారు.
ఏపీలో రూల్ ఆఫ్ లా అదుపు తప్పడంపై డీజీసీ సవాంగ్ ఏం చెబుతారని , రాయలసీమ ఫ్యాక్షన్ కల్చర్ రాష్ట్రమంతా విస్తరించడానికి ఎవరు కారకులని ఆర్కే నిలదీశారు. ఆంద్రజ్యోతి, ఏబీఎన్ కార్యాలయాలపై కూడా వైసీపీ దాడులకు ప్రయత్నిస్తోందన్న వార్తలు దేనికి సంకేతం? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ను తిట్టడం తప్పన్న కేటీఆర్…తమ వాళ్లు బూతులు తిట్టినపుుడు అడ్డు చెప్పారా? అని ప్రశ్నించారు.
తన తల్లిని అవమానించారన్న జగన్…ఇన్నాళ్లూ విజయమ్మను ఎందుకు పక్కనబెట్టారని జగన్ ను ఆర్కే నిలదీశారు. జగన్ కు రక్తపోటు వస్తే రాష్ట్రం, ప్రజలు మూల్యం ఎందుకు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ ప్రోమోను కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.