తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సందర్భానుసారంగా టీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతున్న షర్మిల…సీఎం కేసీఆర్ పైనా పదునైన విమర్శలు చేస్తున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా తన పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోన్న షర్మిల…నేటి నుంచి 400 రోజుల పాటు పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలు సమస్యలేమీ లేవని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, అది నిజమని నిరూపిస్తే తన ముక్కు నేలకు రాసి పాదయాత్ర నిలిపివేస్తానని షర్మిల ఛాలెంజ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు దమ్ముంటే తనతో పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్ విసిరారు. తన పాలనపై కేసీఆర్ కు నమ్మకముంటే తండ్రీకొడుకులు తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అవినీతి పాలనను పాతిపెట్టేందుకే పాదయాత్ర చేస్తున్నానని, మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని అన్నారు. బీసీలు ఇంకెన్ని రోజులు గొర్రెలు, బర్రెలు కాయాలని షర్మిల ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేయాలని కేసీఆర్‌ను షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్షలు కేటీఆర్‌కు మింగుడు పడలేదని, ఏకంగా పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. ఏడేళ్లలో ప్రతి వర్గాన్ని సీఎం కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు.
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగ రేవంత్ రెడ్డి అని, అటువంటి రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించడం సిగ్గుచేటని షర్మిల విమర్శించారు. రేవంత్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని, రేవంత్ పిలక కేసీఆర్ చేతుల్లోనే ఉందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయని షర్మిల ఆరోపించారు.