హైకోర్టు సెంటు స్థలంలో ఇల్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసి పంపిణీని ఆపింది. దీనిపై సమగ్ర అధ్యయనం చేయమని జగన్ సర్కారును ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా దీనిపై సంచలన విషయాలు బయటపెట్టారు ప్రతిపక్ష నేత చంద్రబాబు.
ఇంటి స్థలాలపై కోర్టుకు వెళ్లి ఈ తీర్పు వచ్చేలే చేయడం వెనుక వైసీపీ నేతల హస్తం ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. హౌస్ సైట్స్ విషయంలో జగన్ వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారని తప్పుపట్టారు.
గృహ నిర్మాణాల కోసం కేంద్రం రూ. 3,700 కోట్లు విడుదల చేస్తే అందులో జగన్ సర్కారు 2 వేల కోట్లు దారి మళ్లించిందని, ఆ డబ్బులు లేక ఇపుడు కోర్టులో కేసు వేయించి పథకం ఆపేలే కుట్ర చేశారన్నారు.
దారి మళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీ పన్నిన అతిపెద్ద కుట్రలో కోర్టును వాడుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. కోర్టులో జగనే కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
“జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికి రావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారు. సెంటు పట్టాలిస్తామని చెప్పి ఇవ్వకముందే రూ.6,500 కోట్ల అవినీతి చేశారు. రెండు సెంట్లు నగరాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి. అపుడే లబ్ధిదారులకు న్యాయం జరిగేది’’ అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.