పోటాపోటీగా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ఉద్వేగాలకు.. ఉద్రిక్తతలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి ‘మా’ ఎన్నికలు. ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణు ప్యానల్స్ మధ్య పోరు.. ఎంత రచ్చను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటివరకు ‘మా’ ఎన్నికలు జరిగినా.. ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం మరెప్పుడూ చోటు చేసుకున్న పరిస్థితి లేదంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటు వేయటం కోసం పలువురు ఓటర్లకు తాము విమాన టికెట్లు.. హోటల్ గదులు బుక్ చేశామని.. అవేమీ తప్పు కాదన్న విషయాన్ని విష్ణు ప్యానల్ ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే.
ఇలాంటి వేళ.. ప్రత్యర్థి వర్గంగా ఘాటైన ఆరోపణలు చేశారు సీనియర్ నటుడు నరేశ్. ‘మా’ ఎన్నికల్లో ఇదే.. తన చివరి వీడియో అంటూ ఆయనో క్లిప్ విడుదల చేశారు. అందులో ఆయన ప్రకాశ్ రాజ్ ప్యానల్ మీద భారీ ఆరోపణల్ని సంధించారు.
ఆయన మాటల్ని యథాతధంగా చెప్పేస్తే..
‘‘ఇప్పుడే అందిన దుర్వార్త ఏమిటంటే.. ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారు. మనిషిని బట్టి 10 నుంచి 25 వేల వరకు 3,4 సెంటర్స్‌లో ఈ నైట్ డబ్బులు పంచడం స్టార్ట్ చేశారు. అందుకనే మ్యానిఫెస్టో కూడా రిలీజ్ చేయకుండా.. డబ్బు మమ్మల్ని గెలిపిస్తుంది అనే భరోసాతో మెంబర్స్‌ని లోబరచుకుంటున్నారు.
నేను ఒకటే చెబుతున్నా.. డబ్బులిస్తే తీసుకోండి. ఎందుకంటే వీళ్ల(విష్ణు) దగ్గర నుండి డబ్బులు రావు. నేను కరోనా టైమ్‌లో డబ్బులు పంచితే.. దానికి చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కోసం డబ్బులు పంచుతున్నారు. డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం మీ మనస్సాక్షికి వేయండి. మంచు విష్ణుకే ఓటేయండి.
నేను అంతకంటే కోరను. నేను అబద్దాలు ఆడను. ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే నా చివరి వీడియో’’ అంటూ చెప్పేశారు. ఇంత ఘాటు ఆరోపణలు చేసే నరేశ్.. అందుకు ఏదైనా ఒకట్రెండు సాక్ష్యాల్ని కూడా చూపిస్తే మరింత బాగుండేది కదా? ఈ వీడియోలో అదో లోటుగా మారిందన్న వ్యాఖ్య వినిపిస్తోంది.
#Naresh alleging about #PrakashRaj panel distributing money for votes #MAAelections pic.twitter.com/EQzMzliIEr
— OverSeasRights.Com (@Overseasrights) October 9, 2021