టాలీవుడ్లో టాప్ స్టార్స్ అందరి సినిమాలకీ రిలీజ్ డేట్స్ ఫిక్సయ్యాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఆచూకీ మాత్రం లేదు. దాంతో మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరిగిపోయింది.
అసలు ఆచార్య ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్న నుంచి.. ఏదైనా తేడా జరిగిందా, షూటింగ్ పూర్తయ్యిందా లేదా, అసలిప్పట్లో వచ్చే ఉద్దేశం ఉందా లేదా వంటి ఎన్నో సందేహాలు మొదలయ్యాయి.
వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆచార్య రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీమ్. వచ్చే యేడు ఫిబ్రవరి 4న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. దాంతో మెగాస్టార్ మూవీపై స్వతహాగా ఉండే అంచనాలు ఈసారి రెట్టింపయ్యాయి.
అయితే ఇప్పటికే దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలకి స్టార్ హీరోలంతా శ్లాట్స్ బుక్ చేసేసుకోవడంతో ‘ఆచార్య’ కోసం మేకర్స్ ఏ తేదీని డిసైడ్ చేస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలవుతుందని, అందుకే అల్లు అర్జున్ తన ‘పుష్ప’ చిత్రాన్ని కాస్త ముందుకు జరిపాడనే ప్రచారమూ జరిగింది. ఇప్పుడు వీటన్నింటికీ తెర పడింది.
చిరంజీవికి జంటగా కాజల్, రామ్ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ చిత్రంలో సోనూ సూద్, సంగీత, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెజీనా ఓ స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్‌తో స్టెప్స్ వేసింది.
నిరంజన్‌రెడ్డితో కలిసి రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలతో పాటు నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కొరటాల.