కొంతకాలంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని, కేంద్రం కూడా ఏపీ అప్పులను చూసి భయపడి కొత్త అప్పులు ఇచ్చేందుకు, ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసేందుకు భయపడుతోందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా జగన్ కు కేంద్రం షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ ఖర్చు పెట్టిన రూ.1,086.38 కోట్ల బిల్లులను కేంద్రం రిజెక్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయాల విషయంలో 2013-14 నాటి ధరల ప్రకారం రూ.20,398.61 కోట్ల తుది అంచనా వ్యయానికే కట్టుబడి ఉన్నానని కేంద్రం గతంలోనే పరోక్షంగా చాలాసార్లు చెప్పింది. 2017-18 ధరల ప్రకారం రూ..55,656.87 కోట్ల అంచనా వ్యయానికి అంగీకరించబోమని గతంలోనే స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా పోలవరం పనులకు చేసిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులను రీయింబర్స్ చేయాలన్న జగన్ సర్కార్ రిక్వెస్ట్ కు కేంద్ర జలశక్తి శాఖ నో చెప్పింది.
ఆ వెయ్యి కోట్లలో రూ.805.68 కోట్లు.. తుది అంచనా వ్యయం రూ.20,398 కోట్లకు మించి ఉన్నాయని కేంద్రం భావించింది. ఇక, మిగిలిన రూ.280.69 కోట్ల విలువైన పనులు.. డీపీఆర్‌లో లేవని స్పష్టం చేస్తూ మొత్తం వెయ్యి కోట్ల బిల్లులను తోసిపుచ్చడంతో జగన్ కు షాక్ తగిలింది. దీంతో, ఆల్రెడీ అప్పుల్లో మునిగి తేలుతున్న జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది. పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాకపోగా…రాష్ట్రం చేసిన ఖర్చు కూడా రీయింబర్స్ కాకపోవడంతో ఏపీ ఆర్థిక శాఖపై వెయ్యి కోట్ల భారం పడినట్లయింది.