మీడియా యజమాని కాలమ్ రాయటం.. స్వయంగా ఇంటర్వ్యూలు చేయటం లాంటివి పెద్దగా కనిపించవు. మిగిలిన భాషల సంగతి ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం ఆ కల్చర్ తక్కువే. కావాలంటే.. తమ కింది వారు రాసే వాటికి తమ పేర్లు పెట్టుకునే యజమానులు చాలామంది ఉన్నా.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ రూపు మాత్రం కాసింత సపరేటు అని చెప్పక తప్పదు.
గతంలో ఆయన చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే రెండుసీరిస్ లు పెద్ద ఎత్తున ప్రజాదరణ నోచుకున్నాయి. కాసింత గ్యాప్ అనంతరం తాజాగా మూడో సిరీస్ ను షురూ చేశారు. ఇందులో భాగంగా తొలుత షర్మిలతో ఇంటర్వ్యూ చేసిన ఆయన.. తన రెండో ఇంటర్వ్యూను ఫైర్ బ్రాండ్ మంచు మోహన్ బాబుతో చేశారు.
నిజానికి ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. దశాబ్దాలతరబడి వారి మధ్య ఉన్న స్నేహం కావొచ్చు.. చనువు కావొచ్చు.. ఇంకేమైనా కావొచ్చు.. ఆర్కే తన మార్కును (షర్మిల ఇంటర్వ్యూలో ఇది మిస్ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది) ప్రదర్శిస్తూ అదరగొట్టేశారు. మోహన్ బాబు ముఖం మీదనే ఇంతలా మాట్లాడటం ఆర్కేకు మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని ఆయన తేల్చేశారు.
అయితే.. ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆర్కే నోటి నుంచి వచ్చిన ఒక మాటను పలువురు తప్పు పడుతున్నాయి. అయితే.. మోహన్ బాబును ఇంటర్వ్యూ చేసే ఫ్లోలో.. అలవాటులో భాగంగా అలాంటి వ్యాఖ్య చేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఆయనేమన్నారు? ఎందుకీ ప్రస్తావన వచ్చిందన్న విషయంలోకి వెళితే..
ఇంటర్వ్యూ మధ్యలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. నటుడిగా 47 ఏళ్లు అయింది కదా. మీ ఫ్రెండ్ చంద్రబాబును 40 ఇయర్స్ ఇండస్ట్రీఅంటుంటారన్న మాటకు బదులిచ్చిన మోహన్ బాబు.. చంద్రబాబుకు ఉన్న తెలివితేటలు నాకు లేవన్నారు. దానికి బదులుగా ఆర్కే.. ‘‘మీది పాము.. ముంగీస వ్యవహారం. కొట్టుకుంటారు. తిట్టుకుంటారు. మళ్లీ ముద్దులెట్టుకుంటారు. మీ చిత్తూరు జిల్లా వాళ్లను నమ్మకూడదన్న మాటను యథాలాపంగా అనేశారు.
దానికి స్పందించిన మోహన్ బాబు.. మీ జిల్లావాళ్లను నమ్మాల్నా? అని ప్రశ్నించారు. దానికి ఆర్కే బదులిస్తూ.. ఎనీ డే.. తెలంగాణ వాళ్లను నమ్మొచ్చని వ్యాఖ్యానించారు. దానికి మోహన్ బాబు బదులిస్తూ.. ‘నో డౌట్.. మరి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడటం ఎందుకు? అందరూ చంద్రబాబులా ఎలా ఉంటారు. చంద్రబాబు కనిపిస్తే మాట్లాడుకుంటాం. అందులో ఏముంది?’ అని ప్రశ్నించగా.. తానూ అదే అంటున్నానని.. మీరిద్దరూ ఏదో సందర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుందనే అంటున్నానని ఆర్కే అనగా.. ‘‘ఏంది కలిసిపోయేది?’’ అంటూ మోహన్ బాబు కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చివరకు రాజకీయంగా కాదు.. స్నేహతులుగా కలవొచ్చు కదా? అన్న ఆర్కే మాటలకు.. తప్పులేదని మోహన్ బాబు బదులివ్వటంతో ఆ చర్చ అక్కడితో ముగిసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు.. మోహన్ బాబు.. ఇవన్నీ పక్కన పెడితే.. ఆర్కే నోటి నుంచి వచ్చిన ‘చిత్తూరు జిల్లా వాళ్లను నమ్మకూడదన్న మాట’ పలువురిని హర్ట్ చేసిందన్న వాదన వినిపించింది.