టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై మూడు వారాలు దాటింది. తేజును ఆసుపత్రికి తరలిస్తుండగా బయటికి వచ్చిన ఫొటోలు ఒకట్రెండు మీడియా హల్చల్ చేశాయి తప్ప.. ఆ తర్వాత అతడి ఫొటోలేవీ బయటికి రాలేదు.
తేజు కోలుకుంటున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి కానీ.. మూడు వారాల తర్వాత కూడా అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకపోవడంతో మెగా అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. తన సినిమా రిపబ్లిక్ రిలీజ్ టైంలో దాన్ని ప్రమోట్ చేయడం కోసం తేజు ఆడియో లేదా వీడియో బైట్ ఇచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి కానీ.. అది నిజం కాలేదు.
తాజాగా కొండపొలం ఆడియో వేడుకలో తేజు తమ్ముడు మాట్లాడుతూ.. తన అన్నయ్య మరి కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే సూచనలున్నట్లు చెప్పాడు. కాగా ఈలోపే తేజు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించాడు.
థమ్సప్ అంటూ కేవలం తన చేయి మాత్రమే కనిపించేలా తేజు ఒక ఫొటో దిగి.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. తనపై, తన సినిమా రిపబ్లిక్‌పై చూపించిన ప్రేమకు థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదని.. త్వరలోనే అందరినీ కలుస్తానని వ్యాఖ్య కూడా జోడించాడు తేజు.
https://twitter.com/IamSaiDharamTej/status/1444637180874276867
ఇది ఆసుపత్రి నుంచి తీసిన ఫొటోనే అని బ్యాగ్రౌండ్‌ను బట్టి అర్థమవుతోంది. అతను మూడు వారాలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజుకు ఫిజియో థెరపీ ఎక్సర్సైజ్లు జరుగుతున్నాయని.. ఇంకో రెండు మూడు రోజుల్లోనే అతను డిశ్చార్జ్ కావచ్చని తెలుస్తోంది.
ట్విట్టర్ ద్వారా తేజు టచ్‌లోకి రావడంతో అందరూ అతడికి వెల్కమ్ బ్యాక్ అని విష్ చేస్తున్నారు. తేజు ట్వీట్‌కు రిపబ్లిక్ దర్శకుడు దేవా కట్టా స్పందిస్తూ.. ఇది చాలా ఉద్వేగంతో, కన్నీళ్లతో కూడుకున్న సందర్భమని, సక్సెస్ఫుల్ రిపబ్లిక్లోకి స్వాగతం అని వ్యాఖ్యానించాడు.